Connect with us

Cultural

TANTEX @ Dallas – తెలుగింటి ఆచారాల విశిష్టత ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు

Published

on

Dallas Forth Worth, Texas, February 2, 2025: ప్రతి సంవత్సరం జనవరి మాసంలో జరుపుకొనే సంక్రాంతి పండుగ అంటే తెలుగు వాళ్ళకు ఎంతో ఇష్టం. భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అమెరికా లో నివసిస్తున్న తెలుగువారు కూడా సంక్రాంతి పండుగను అంతే ఘనంగా జరుపుకొనేలా, అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన డాలస్/ఫోర్ట్ వర్త్ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం TANTEX వారు ఎప్పటిలాగే తెలుగువారి సంప్రదాయ పద్ధతులకు, ఆధునికతను మేళవించి ”సంక్రాంతి సంబరాలు 2025 ” ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (Telugu Association of North Texas – TANTEX) ఆధ్వర్యంలో ఇర్వింగ్ సిటీ లోని ఇర్వింగ్ ఆర్ట్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ “సంక్రాంతి సంబరాలు” ఆహూతులు మెచ్చే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో ఘనంగా నిర్వహించ బడ్డాయి. సంస్థ 2025 అధ్యక్షులు శ్రీ చంద్ర శేఖర్ పొట్టిపాటి (Chandrasekhar Pottipati) మరియు సాంస్కృతిక సమన్వయకర్త దీప్తి సూర్యదేవర ఈ కార్యక్రమాలను నిర్వహించారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు సభా ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించారు.

స్థానిక ఇండియన్ రెస్టారెంట్ ఏ 2 బి వారు ఆహూతులందరికీ నోరూరించే షడ్రసోపేతమైన పలు రకాల వంటకాల్ని రుచి చూపించారు. ఆహూతులే కాకుండా సుమారు 150 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం, అచ్చమైన తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా వీనుల విందైన పాటలతో, తెలుగింటి ఆచారాలను వాటిలోని విశిష్టత ఉట్టిపడేలా ఈ సంక్రాంతి సంబరాలలో సంగీత, నృత్య అంశాలకు పెద్ద పీట వేయడం జరిగింది. తొలుత కల్చరల్ చెయిర్ దీపికా రెడ్డి స్వాగత వచనాలు పలికారు.

కరుణాకర్ గద్దె కొరియో గ్రాఫరుగా రిషిత్ విఠల్ గద్దె భక్తిరస గీతాన్ని ఆలపించడం ఇంకా భాను పావులూరి కొరియోగ్రాఫరుగా చిరంజీవులు చరణ్ పావులూరి, భాను పావులూరి అమెరికా జాతీయ గీతం వినిపించడంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రసిద్ధ ప్రధాన వ్యాఖ్యాతలు వీణ యలమంచిలి మరియు శ్రీనివాస్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరించారు. విశేషంగా ఇన్స్టా గ్రాము రీల్స్ పోటీ లో అనేక మంది పాల్గొనడం, ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతు లివ్వడం కార్యక్రమానికె ఒక హై లైట్ . సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభ సూచికగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సంప్రదాయ సంక్రాంతి (Sankranti Festival) సంబరాల జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం జరిగింది.

సాంస్కృతికప్రదర్శనలలో భాగంగా మన్వితా రెడ్డి బృందం ”మూషిక వాహన ”’శాస్త్రీయ నృత్యం, చంద్రిక అద్దంకి బృందం ”పల్లె పండుగ’ జానపద నృత్యం, సింధూజ ఘట్టమనేని బృందం ”ధ్యానశ్లోకం బృంద” భరతనాట్యం, హర్షిత మారుబోయిన బృందం ‘గర్ల్స్ ఆఫ్ గెలాక్సీ” చలన చిత్ర నృత్య గీతాల సమాహారం, వినీల చిట్లూరు బృందం ”బ్యూటిఫుల్ బటర్ ఫ్లయ్స్” జానపద నృత్యం, రాజేశ్వరి అన్నం బృందం ”గోవిందాశ్రిత గోకుల బృంద”శాస్త్రీయ నృత్యం, శోభా ప్రత్తి బృందం ”తెలుగింటి నక్షత్రాలు” చలన చిత్ర సంగీత నృత్య గీతాలసమాహారం, జై షీలా శెట్టి బృందం ”జయ జనార్దనా కృష్ణా” శాస్త్రీయ నృత్యం, పద్మా శొంఠి బృందం ”గణపతి భజన ”శాస్త్రీయ నృత్యం అందరినీ ఆకట్టుకున్నాయి.

ఉషా మాసారపు ”మిర్చి డ్యాన్సు” చలన చిత్ర నృత్య గీతాల సమాహారం, శ్రీదేవి యడ్లపాటి బృందం ”కొండలలో నెలకొన్న..” శాస్త్రీయ నృత్యం, ”శోభా తీగల బృందం” సంక్రాంతికి వస్తున్నాము ”చలన చిత్ర సంగీత నృత్య గీతాల సమాహారం, సుజావంతి శ్రీనివాసన్ బృందం ”కృష్ణ లీల” శాస్త్రీయ నృత్యం, శాంతి నూతి బృందం ”బాలయ్య 50 వసంతాల వేడుకలు” చలన చిత్ర సంగీత నృత్య గీతాల సమాహారం, స్వప్నశ్రీ చకోటి బృందం ”గొల్లభామలు – కృష్ణ” శాస్త్రీయ నృత్యం, కల్యాణి ఆవుల బృందం ”కొయిలారే” శాస్త్రీయ నృత్యం, హర్షద మాశెట్టి బృందం ”క్వీన్ స్ యు నైట్” చలన చిత్ర సంగీత నృత్యగీతాల సమాహారం వీక్షకులను ఎంతగానో అలరించాయి.

టాంటెక్స్ (Telugu Association of North Texas – TANTEX) తక్షణ పూర్వాధ్యకులు శ్రీ సతీష్ బండారు (Satish Bandaru) తనకు సహకారం అందించిన క్రిందటి సంవత్సరం కార్యవర్గ సభ్యులు, స్వచ్చంద కార్యకర్తలు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. 2025 పాలక మండలి అధిపతి డాక్టర్ తిరుమల రెడ్డి కొండా (Dr. Tirumala Reddy Konda) 2025 నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత 2025 వ సంవత్సరానికి ఎన్నికైన అధ్య క్ష కార్యదర్శిలతో పాటు పాలక మండలి మరియు కార్యనిర్వాహక బృందాన్ని సభకు పరిచయం చేయడం జరిగింది.

తదుపరి, 2025 వ సంవత్సరానికి టాంటెక్స్ (Telugu Association of North Texas – TANTEX) ప్రస్తుత అధ్యక్షులు శ్రీ చంద్ర శేఖర్ పొట్టిపాటి (Chandrasekhar Pottipati) మాట్లాడుతూ… అసంఖ్యాకమైన తెలుగు వారి సమాజ శ్రేయస్సే ధ్యేయంగా అవిశ్రాంతంగా పనిచేయడానికి నేను కట్టుబడి ఉన్నానన్నారు. టాంటెక్స్ సంస్థ 1986 లో స్థాపించబడినప్పటి నుండి మూడు దశాబ్దాలుగా తెలుగు సంస్కృతి, భాష, వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడంతో పాటు ఈ ప్రాంతంలోని తెలుగు మాట్లాడే ప్రజల మధ్య ఐక్యతా భావాన్ని పెంపొందించడానికి అంకితమైన ఈ గొప్ప సంస్థకు అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

టాంటెక్స్ (TANTEX) పాలక మండలి మరియు కార్యకర్తల సహకారాలతో అమెరికా తెలుగు వారికి సేవ చేసుకొనే అదృష్టం టాంటెక్స్ సంస్థ ద్వారా తనకు కలిగిందని, టాంటెక్స్ సంస్థ ఘన చరిత్ర కాపాడేలా తన అపార అనుభవంతో సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తాననీ, భావితరాన్ని మరిన్ని అవకాశాలతో ప్రోత్సహిస్తూ, యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ, ఎన్నో విన్నూత్న కార్యక్రమాలతో మరింత సేవాతత్పరత కలిగిన సంస్థగా టాంటెక్స్ సంస్థను తీర్చిదిద్దుతాననీ ఆయన పేర్కొన్నారు. క్రొత్తగా ఎన్నికైన బోర్డు ఆఫ్ ట్రస్టీస్ BOT అధిపతి డాక్టర్ తిరుమల రెడ్డి కొండా, ఉపాధిపతి శ్రీ దయాకర్ మాడా (Dayakar Mada) మాట్లాడుతూ… కార్యనిర్వాహక బృందానికి తమ వంతు సహకారము, సహాయము ఎప్పుడూ ఉంటుంది అని తెలిపారు.

గత సంవత్సర కాలంగా అసమాన ప్రతిభతో టాంటెక్స్ సంస్థను విజయ వంతంగా నిర్వహించి పాలక మండలి అధిపతిగా పదవీ విరమణ చేసిన శ్రీ యుతులు సురేష్ మండువ (Suresh Manduva) గారినీ, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ఉపాధిపతి శ్రీ హరి సింగం గారినీ మరియు తక్షణ పూర్వ అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు గారినీ, వారితో పాటు సంస్థ అభి వృద్ధికి ఎంతగానో సహకరించిన పూర్వపు కార్యవర్గ సభ్యులనూ, పాలక మండలి సభ్యులనూ టాంటెక్స్ గవర్నింగ్ బోర్డు 2025 తరపున వారికి శాలువా కప్పి, పుష్పగుచ్చములతోను, ప్రత్యేక జ్ఞాపికలతోను టాంటెక్స్ సంస్థ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, ఉత్తరాధ్యక్షులు శ్రీమతి మాధవి లోకిరెడ్డి (Madhavi Lokireddy), ఉపాధ్యక్షులు శ్రీ ఉదయ్ కిరణ్ నిడిగంటి ఇంకా కార్యవర్గ మరియు పాలకమండలి సభ్యులు వారిని ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సంక్రాంతి సంబరాలకి ప్రత్యేకంగా విచ్చేసి తమ వీనుల విందైన మధుర గాన ప్రదర్శనలతో అతిథులని ఎంతో ఆనందపరచిన గాయకులు సాయి తరంగ్ వందేమాతరం మరియు శ్రేయలక్ష్మి కోడెల లకు పుష్పగుచ్చాలను అందించి సన్మానం చేయడం జరిగింది. “సంక్రాంతి సంబరాలు” కార్యక్రమ సాంస్కృతిక సమన్వయకర్త దీప్తి సూర్యదేవర (Deepthi Suryadevara) మాట్లాడుతూ… ఎంతో ఓపికగా కొన్ని గంటలపాటు కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించి వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథి మహారధులకూ, రుచికరమైన విందు భోజనం వడ్డించిన ఏ 2 బి రెస్టారెంట్ (A2B Indian Vegetarian Restaurant) యాజమాన్యం వారికీ, టాంటెక్స్ సంస్థ మహారాజ పోషకులకు మరియు ”సంక్రాంతి సంబరాలు”కార్యక్రమ పోషకులకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేశారు.

కార్యక్రమానికి హాజరైన జాతీయ మరియు స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అంతే కాకుండా ప్రసార మాధ్యమాలైన Sakshi, Cross Roads Media, Prime9 News, I Asia News, NRI Page, NRI2NRI.COM, TNI Live, తెలుగు టైమ్స్ వారికి కూడా ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియజేయడం జరిగింది.

ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా తెర వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని విజయ వంతంగా నిర్వహించడానికి తోడ్పడిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం TANTEX సంస్థ పాలక మండలిసభ్యులకూ, కార్య నిర్వాహక బృంద సభ్యులకూ మరియు కార్యకర్తలందరికీ ఈ వేడుక కార్యక్రమ సమన్వయ కర్త శ్రీమతి దీప్తి సూర్యదేవర తమ హృదయపూర్వక కృతఙ్ఞతాభివందనాలు తెలియజేసిన పిదప భారతీయ జాతీయ గీతం ఆలాపనతో, నాటి అత్యంత శోభాయమైన కార్యక్రమం ”సంక్రాంతి సంబరాల”కు తెరపడింది.

error: NRI2NRI.COM copyright content is protected