ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ‘టాంటెక్స్’ నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 18న జరిగిన 182 వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. చిన్నారులు సింధూర, సాహితీ తులసీదాస్ కీర్తనతో సభ ప్రారంభమైంది. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ‘టాంటెక్స్‘ సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీనివాసులు బసాబత్తిన ముఖ్య అతిథి శ్రీ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారిని పరిచయం చేశారు.
నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారు హైదరాబాదు నుండి జూమ్ లో “మను చరిత్ర – పెద్దన కథన నైపుణ్యం” అన్న అంశంపై చక్కగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన గారు ముఖ్య అతిధి జ్ఞాపిక చదివి వినిపించారు.
తరువాతి అంశంగా “మనతెలుగు సిరి సంపదలు” ధారావాహిక లో భాగంగా డా. ఊరిమిండి నరసింహారెడ్డి గారు పొడుపు కథలు, నానార్థాలను సభ్యులకు గుర్తుచేశారు. గత 52 నెలలుగా వీరు ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉన్నారు. డా. సత్యం ఉపదృష్ట గారు మరియు శ్రీమతి కాశీనాథుని రాధ గారు పద్య సౌగంథం శీర్షికను నిర్వహించడం మనకు తెలిసిందే. ఈసారి కాశీనాథుని రాధ గారు ఆముక్త మాల్యద నుండి రెండు పద్యాలను గుర్తు చేశారు.
మాసానికో మహనీయుడు శీర్షిక కింద శ్రీమతి కోలా అరుణ జ్యోతి రెడ్డి గారు ఈ నెలలో గుర్తు చేసుకోవలసిన ప్రముఖ రచయితల గురించి వివరించారు. ప్రముఖ రచయిత కీర్తి శేషులు శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారిని సభలో అందరికీ గుర్తు చేశారు. శ్రీ నిడిగంటి గోవర్ధనరావు గారు “అంతా మన మంచికే” అంటూ జీవితంలో ఎత్తుపల్లాలను ఆనందంగా దాటడం ఎలాగో వివరించారు. శ్రీ లెనిన్ బాబు వేముల గారు భవభూతి ఉత్తర రామచరితంను అందరికీ పరిచయం చేశారు.
టాంటెక్స్ అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి గారు ముఖ్య అతిథి శ్రీ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారికి, ప్రార్థనా గీతం పాడిన సింధూర, సాహితీ తోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.