ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ నూతన కార్యవర్గం లావు అంజయ్య చౌదరి సారథ్యంలో బాధ్యతలు స్వీకరించి సుమారు 20 రోజులవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ తానా ఫౌండేషన్ చైర్మన్, సెక్రటరీ మరియు ట్రెజరర్ ఎన్నిక మాత్రం ఇంకా ముగియలేదు. ఇటీవల ముగిసిన ఎన్నికలలో తానా ఫర్ ఛేంజ్ టీం క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి కాబట్టి వారు అనుకుంటే ఫౌండేషన్ తతంగం ఎప్పుడో ముగిసేది. కానీ భక్తా బల్లా రాజీనామాతో ఖాళీ అయిన ఫౌండేషన్ ట్రస్టీ పదవిని ఎవరితో భర్తీ చేయాలి, అలాగే ఫౌండేషన్ చైర్మన్, సెక్రటరీ మరియు ట్రెజరర్ లకు బోర్డులో ఓటింగు హక్కులు వస్తాయి కాబట్టి తమ వారికే ఆ పదవులు వచ్చేలా చేద్దామనుకునే విషయంలో పీఠముడులు పడినట్లు సమాచారం. సందట్లో సడేమియా అని ఆ పదవులకు ఆశావహులుగా ఉన్నవారందరూ ఫౌండేషన్ సభ్యులను అలాగే లీడర్షిప్ ను ప్రసన్నం చేసుకునే పనిలో తమ తమ టాలెంట్ కి పని చెప్పారు. ఒక సమయంలో 20 రోజులైంది ఇంకా ఎన్నాళ్ళు నాన్చుతారు, ఫౌండేషన్ కార్యక్రమాలన్నీ మూలన పడ్డాయి అంటూ కొంతమంది దుడుకుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినట్లు వినికిడి.
చివరికి ఈరోజు జరిగిన తానా ఫౌండేషన్ మీటింగులో తేల్చినట్లు సమాచారం. చైర్మన్ గా వెంకట రమణ యార్లగడ్డ, సెక్రటరీ గా శశికాంత్ వల్లేపల్లి, ట్రెజరర్ గా శ్రీకాంత్ పోలవరపు లను ఫౌండేషన్ సభ్యలు ఎన్నుకున్నట్లు తెలిసింది. టీం తానా తరపున యాక్టివ్ గా పని చేసిన శశికాంత్ వల్లేపల్లి సెక్రటరీ గా ఎన్నికవడం కొసమెరుపు. కాకపోతే ఫౌండేషన్ తరపున ఆల్రెడీ బాగా పనిచేసిన వ్యక్తి, అందునా తానా ఫర్ ఛేంజ్ లక్ష్యాల ప్రకారం పని చేసినవాళ్లకే పదవి కాబట్టి శశికాంత్ కి పదవి దక్కిందని కొందరి వాదన. మొత్తంమీద ఫౌండేషన్ పదవుల పందేరం కథ 20 రోజుల తర్వాత అయినా సుఖాంతం అయినందుకు తానా సభ్యులు హర్షిస్తున్నారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ఫౌండేషన్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేసారు.