Connect with us

Events

షడ్రుచుల సమ్మేళనంగా తామా ఉగాది ఉత్సవాలు @ Atlanta, Georgia

Published

on

అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ (Telugu Association of Metro Atlanta) వారి శ్రీ శోభకృత్ ఉగాది ఉత్సవాలు డెన్మార్క్ హై స్కూల్, ఆల్ఫారెట్టాలో లో ఏప్రిల్ 8 న అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవోపేతంగా జరిగాయి. రోజంతా కుండపోత వర్షం, చలి ఉన్నప్పటికీ, ఈ ఉత్సవాలలో 2000 మందికి పైగా అట్లాంటవాసులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్య వికాస, విందు వినోద, నృత్య సాంస్కృతిక సాహిత్య సంగీత సందడులతో ప్రాంగణం హోరెత్తిపోయిందనడంలో అతిశయోక్తి లేదు.

గోల్డ్ స్పాన్సర్స్ గా అప్2డేట్ టెక్నాలజీస్, పెర్సిస్ బిర్యానీ గ్రిల్, మాగ్నమ్ ఓపస్ ఐటి, హెచ్ సి రోబోటిక్స్, రాపిడ్ ఐటి, సిల్వర్ స్పాన్సర్స్ గా ఇఐఎస్ టెక్నాలజీస్, 27న్త్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్ సి ఎల్ డి సాఫ్ట్, బ్రాంజ్  స్పాన్సర్స్ గా విషి & విక్కీ రియాలిటీ, గరుడావేగా లాజిస్టిక్స్, అమృత్ ఆయుర్వేద, అస్స్యూర్ గురు ఇన్స్యూరెన్స్, ట్రూవ్యూ ఫైనాన్సియల్స్, ట్విన్కిల్ పీడియాట్రిక్స్, హౌస్సో రియల్ ఎస్టేట్ వెంచర్స్, శ్వేత తెలుగు ఫుడ్స్ వ్యవహరించారు.

బంతి భోజనాలలో 23 రకాల వంటకాలు, 70-80 మంది వాలంటీర్ల కృషి, ఆఖరివరకూ భోజనాల వడ్డన వంటి అద్వితీయ విషయాలు తెలుగు అసోసియేషన్ అఫ్ అట్లాంటా (TAMA) వారు విందు భోజనాల నిర్వహణలో ఎందుకు ముందుంటారో చెప్పటానికి తార్కాణాలు. యువత ప్రాధాన్యత ఈ సారీ కనిపించింది, ప్రతి విభాగంలోనూ  వారు పెద్దలతో మమేకమై పనిచేయడం ముదావహం.

కల్చరల్ మరియూ స్టాల్ల్స్ రిజిస్ట్రేషన్లు దాదాపు 3 వారాల ముందు, బాలల మరియూ పెద్దల పోటీలు రెండు రోజుల ముందు, టిక్కెట్లు 1 రోజు ముందు నిలిపివేయడం తామాకి ప్రజలలో ఉన్న విశ్వాసాన్ని, ఇష్టాన్ని తెలియజేస్తున్నది. ప్రజలు, స్పాన్సర్లు, వాలంటీర్లు తామాకి మూలస్తంభాలు, వారి ఉత్సాహమే ప్రోత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికే చేయడం, భవిష్యత్తులో మరిన్ని చేయడం జరుగుతుంది. వివరములకు www.tama.org సందర్శించండి లేదా ఇమెయిల్ info@tama.org చెయ్యండి.

2 గంటలకు పిల్లలకు ప్రత్యేకంగా బాలల పోటీలు నిర్వహించారు. 100 మందికి పైగా బాలబాలికలు పాల్గొని, తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. బాల కవులు, బాల పలుకుల విభాగాలలో పిల్లలను 3 వర్గాలుగా విభజించటం జరిగింది. తామా  విద్యా  కార్యదర్శి వెంకట్ గోక్యాడ అందరినీ ఆహ్వానించి, నియమ నిబంధనలు తెలియజేశారు.

పెద్దవారి కవితలు, చిన్న కథల పోటీలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన ప్రొఫెసర్ శ్రీ. విద్యాసాగర్, మనబడి టీచర్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు వేదిక మీద బహుమతి ప్రధానం జరిగింది. 20కి పైగా ఉన్న బట్టలు, తినుబండారాలు, నగలు, రకరకాల వ్యాపారాల దుకాణాల చుట్టూ పిల్లలు, మహిళలు కలియ తిరుగుతూ కొనుగోలు చేయడం కనిపించింది.

మీట్ & గ్రీట్ లో భాగంగా సెలెబ్రిటీలతో అందరూ ఫోటోలు తీసుకున్నారు. సాంస్కృతిక కార్యదర్శి తిరు చిల్లపల్లి ఉగాది శుభాకాంక్షలతో అందరికీ స్వాగతం పలికి, తామా కార్యవర్గ మరియూ బోర్డు సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించి, విఘ్నేశ్వరునికి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ఆరంభించారు. అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి తామా చరిత్ర గురించి వివరించి, అన్ని వయసుల వారికి చేస్తున్న ఉపయోగకరమైన కార్యక్రమాల గురించి సవివరంగా తెలిపారు.

బోర్డు ఛైర్మన్ సుబ్బారావు మద్దాళి తామా ఉచిత క్లినిక్, సెమినార్లు, స్కాలర్షిప్స్ గురించి విపులీకరించారు. పండితులు శ్రీ. రవి శంకర్ పంచాంగ శ్రవణం గావించగా, ఆహుతులు శ్రద్ధగా ఆలకించారు. ఆద్యంతం సాగిన రాఫుల్ టిక్కెట్లు, వైవిధ్యమైన, బహుమతులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గౌరవ అతిథులు కాన్సులేట్ జనరల్ శ్రీమతి. స్వాతి కులకర్ణి, సెనేటర్ శ్రీ. షాన్ స్టిల్, డాక్టర్ కామేశ్వర రావు బద్రి అందరికీ అభినందనలు తెలిపి తామా వారు చేస్తున్న వివిధ కార్యక్రమాలను శ్లాఘించారు. వారిని తామా వారు సముచితంగా సత్కరించారు.

ఈ ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున  జరగడానికి కారణభూతులైన స్పాన్సర్స్ అందరినీ తామా వారు వేదిక మీదకు ఆహ్వానించి ఘనంగా సత్కరించుకున్నారు. వారు తమకు, తామాకు ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటూ, ఇది ఇలాగే కొనసాగుతుందనీ, ఇలాంటి కార్యక్రమం చేయటం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని తెలిపి, తామా జట్టుని అభినందించారు.

ఉగాది పురస్కారాలతో భాగంగా ఆర్ ఎన్ ఆర్ మెడికల్ కాలేజ్ స్థాపించిన డాక్టర్లు, మనబడి నాయకులు, టీచర్లు, సాహితీవేత్తలు, శాస్త్రవేత్తలు, కళకారులు ఇలా ఎందరినో సత్కరించడం జరిగింది. అట్లాంటా కళాకారులు ప్రదర్శించిన భక్తి గీతాలు, సినిమా నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, జానపద గీతాలు, మెడ్లీలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి.

విన్నూత్నంగా సాగిన ఘోష్టి గానం, రామాయణ నృత్యగానం, పురాణ నాటక పద్యాలు, మనబడి పిల్లల నాటకాలు, ఫ్యాషన్ షో వంటి కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. తామా  వారు ప్రత్యేకంగా పిలిపించిన మిక్కీ మౌస్ మరియు డోనాల్డ్ డక్ వేషధారణతో వచ్చిన వ్యక్తి అందరినీ, ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకున్నారు. యాంకర్లు రఘు వేముల, శ్రావ్య మానస తమ సమయస్ఫూర్తి తో, చలాకీతనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను గావించారు.

సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు అందజేసారు. ప్రముఖ టాలీవుడ్  సినీ గాయకులు అనుదీప్ దేవ్ మరియు మౌనిమ మ్యూజికల్ నైట్ లో భాగంగా పాడిన పాటలు చిన్న పెద్ద అందరూ వేదిక మీదకు వచ్చి డ్యాన్సులు చేసేలా హుషారుగా సాగాయి. యువతతో వారు పాడిన మెడ్లీ ఆకట్టుకుంది.  తామా వారు ఈ విశిష్ట కళాకారులందరినీ సత్కరించారు.

ఇండియా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల ప్రత్యేక మిఠాయిలు, కారాలు, పొడులు, పచ్చళ్ళతో  పాటు ఓంకార్ ఫుడ్స్ షడ్రుచుల ఉగాది పచ్చడి మరియు పెర్సిస్ బిర్యానీ గ్రిల్ వారు అందజేసిన నవకాయ పిండివంటల సహపంక్తి భోజనాలను మెచ్చుకోనివారు లేరు. భారతదేశంలోని పెళ్ళిళ్ళను తలపించేలా ఉన్న ఈ అమెరికాలోని  అత్యుత్తమ బంతి భోజనాలలో కొసరి కొసరి వడ్డించడం, అందరికీ అన్ని పదార్థాలు వచ్చేలా చూసుకోవడం వల్ల అందరూ సంతృప్తిగా భోజనం చేయడం కనిపించింది.

ఆప్యాయ పలకరింపులు, కొత్త పరిచయాలు, ఏర్పాట్ల మెచ్చుకోలు, ఎన్నో మధుర స్మృతులతో సంతోషంగా సాగటం ఆనందదాయకం. చివరిగా ఉపాధ్యక్షులు సురేష్ బండారు ఉత్సవాలను అజరామరంగా విజయవంతం చేసిన జార్జియా ప్రజలకు, స్పాన్సర్లకు, వాలంటీర్లకు, ఆహ్వానితులకు, అతిధులకు, ప్రేక్షకులకు, కళాకారులకు, డెకొరేషన్ క్రియేటివ్ కస్టమ్స్ మాధవి కొర్రపాటి కి, డెకొరేషన్ మావ్ ఈవెంట్స్ వెంకట్, మనస్వికి,  డీజే టిల్లు నవీన్ కి,  ఫోటో వీడియో అట్లాంటా దేశీ ఈవెంట్స్ రవళి & టీం కు, తామా టీం కు ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected