Connect with us

Events

అనూప్ రూబెన్స్ మ్యూజికల్ నైట్ తో ఉర్రూతలూగించిన తామా దీపావళి వేడుకలు

Published

on

నవంబర్ 12న అట్లాంటా తెలుగు సంఘం (తామా) వారు దీపావళి వేడుకలు ఫేజ్ ఈవెంట్స్, అల్ఫారెట్టా నగరంలో లో అత్యంత వైభవంగా నిర్వహించారు.దాదాపు 1500 మందికి పైగా అట్లాంటా వాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రఘు కుంచె పాటలు మరియు అనూప్ రూబెన్స్ బృందం నిర్వహించిన సంగీత విభావరి ఆహూతులందరని ఉర్రూతలూగించింది.

ఈ కార్యక్రమానికి ఎస్ ఎస్ లెండింగ్ ఎల్ ఎల్ సి, ఇన్ఫో స్మార్ట్ టెక్నాలజీస్ ఐ ఎన్ సి, మాగ్నమ్ ఓపస్ ఐటి, అడ్డా రెస్టారెంట్, ఏ ఐ 9 సొల్యూషన్స్, ర్యాపిడ్ ఐటి, ఈ ఐ ఎస్ సొల్యూషన్స్, ఫోకస్ కన్సల్టింగ్ సర్వీసెస్, సాంప్రా సాఫ్ట్, యూనిఫై సొల్యూషన్స్, థాట్ వేవ్ సాఫ్ట్ వేర్ & సొల్యూషన్స్, శ్రీ. గిరీష్ మోడీ, వి ఎల్ లైఫ్ ప్లాన్, కానాప్ సిస్టమ్స్ వారు సమర్పకులు.

ఈ సందర్భంగా మధ్యాహ్నం 2 గంటలకు పిల్లలకు ప్రత్యేకంగా బాలల పోటీలు నిర్వహించారు. 100 మందికి పైగా బాలబాలికలు పాల్గొని, తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. పిల్లలను 3 వర్గాలుగా, అంటే 5-8, 9-12 మరియూ 13-16 సంవత్సరాలగా విభజించటం జరిగింది.

తామా విద్యా కార్యదర్శి యశ్వంత్ జొన్నలగడ్డ అందరినీ బాలల పోటీలకు ఆహ్వానించి, నియమ నిబంధనలు వివరించారు. ముందుగా బాల కవులు పోటీలు, తర్వాత బాల పలుకులు పోటీలు జరిగాయి. విజేతలకు వేదిక మీద బహుమతి ప్రధానం జరిగింది.

20కి పైగా ఉన్న వస్త్రాలు, నగలు, రకరకాల వ్యాపారాల స్స్టాల్ల్స్ చుట్టూ పిల్లలు, మహిళలు సరదాగా తిరుగుతూ, కొనుగోలు చేయడం కనిపించింది. తామా సాంస్కృతిక కార్యదర్శి సునీతా పొట్నూరు ఆహూతులందరని ఆహ్వానించారు. తామా టీం మరియు బోర్డు సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించి వారిచే జ్యోతి ప్రజ్వలన గావించారు.

అధ్యక్షులు రవి కల్లి తామా ఇప్పటి వరకు ఏయే కార్యక్రమాలు చేస్తున్నారో వివరించారు. బోర్డు ఛైర్మన్ శ్రీరామ్ రొయ్యల తామా ఉచిత క్లినిక్, మనబడి, వివిధ సదస్సుల వివరాలు తెలిపారు. ముందుగా వినాయకుని పాటతో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి.

క్లాసికల్ వెస్ట్రన్ ఫ్యూషన్, కీర్తనలు, సినిమా పాటలు, కూచిపూడి నృత్యాలు, బ్రేక్ డ్యాన్సులు వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలను సునీతా సమన్వయపరిచి, పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను బహుకరించారు. కార్యక్రమానికి ముఖ్య వ్యాఖ్యాతగా యాంకర్ సమీరా వ్యవహరించారు.

తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు గాయకుడు రఘు కుంచె ఆలపించిన హుషారైన గీతాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. అలాగే మరొక సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మరియూ వారి టీం (10 మంది) మ్యూజికల్ నైట్ లో భాగంగా తమ పాటలతో ప్రాంగణాన్ని జోరుగా హుషారుగా మార్చేశారు.

మరీ ముఖ్యంగా వారు వేదికపైన తామా కోసం సమకూర్చిన మధురమైన గీతం ఈ వేడుకలో ఎంతో ప్రత్యేకతతో నిలిచింది. ఎంతో మంది ఆహూతులు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఇంతగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన కళాకారులను తామా వారు సన్మానించి, సత్కరించారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారు తామా 41వ వార్షిక ప్రత్యేక సంచిక సోవినీర్ ని విడుదలచేసి మొదటి ప్రతిని డెల్టా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అధినేత శ్రీనివాస్ లావు గారికి అందజేయగా, తామా కార్యవర్గం వేదిక మీద వున్న మిగతా వారికి అందజేశారు. ప్రేక్షకులందరికీ తలా ఒక పుస్తకం ఇవ్వడం జరిగింది. ఏ కార్యక్రమానికైనా స్పాన్సర్లు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే.

ప్రత్యేక అతిథుల సమక్షంలో అధ్యక్షులు రవి కల్లి వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు. స్పాన్సర్లందరికీ మొమెంటో, శాలువా మరియూ పుష్పగుచ్ఛముతో ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. స్పాన్సర్లు తామా వారికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేసి, తామాతో వారి అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్నారు.

స్వర్గీయ శ్రీనివాస్ రాయపురెడ్డి గారి మెమోరియల్ తామా వాలంటీర్ 2022 అవార్డు ఎప్పుడూ వెనక వుండి ఎంతో పని చేసే సురేష్ ధూళిపూడి గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాయపురెడ్డి గారి మిత్రులు అనేకమంది వేదిక మీదకు వచ్చి, ఆయనతో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

డాక్టర్ శ్రీహరి మాలింపాటి గారు తామా ఫ్రీ క్లినిక్ ఏర్పాటు చేయడంలో ఎంతో తోడ్పాటు అందించారు. ఆయన స్మారకార్థం తామా క్లినిక్ వాలంటీర్ అవార్డు ఈ సంవత్సరం మొదటి నుండి ఎంతో సేవ చేసిన దీప్తి తాళ్లూరి గారికి ఇచ్చారు. అదే సమయంలో తామా క్లినిక్ వాలంటీర్ డాక్టర్లను, మనబడి టీచర్లను సత్కరించడం జరిగింది.

తామా వారి భోజనాలు చాలా రుచిగా, శుచిగా ఉంటాయన్నది అందరూ అనుకునే మాట. ఈసారి ప్రముఖ రెస్టారెంట్ అడ్డా వారు వంటకాలు రుచికరంగా అందజేశారు. ఇంత పెద్ద ఎత్తున భోజనాలు జరిపించాలంటే ఎంతోమంది వాలంటీర్ల సహాయం కావాలి, దాదాపు 50 మందికి పైగా ఎంతో కష్టపడ్డారు.

ఉపాధ్యక్షులు సాయిరామ్ కారుమంచి భోజనాల అనుసంధానకర్తగా వ్యవహరించి, అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. కార్యక్రమాల మధ్యలో రాఫుల్ తీయడం జరిగింది, పాల్గొన్న ప్రేక్షకులు ఎన్నో విలువైన బహుమతులు గెలుచుకున్నారు.

చివరగా కన్నుల పండువగా, వీనుల విందుగా సాగిన ఉత్సవాలను విజయవంతం చేసిన అట్లాంటా ప్రజలకి, స్పాన్సర్స్ కు, ప్రాంగణం యాజమాన్యానికి, ఆర్టిస్టులకు, అడ్డా రెస్టారంట్ కు, కేకే పిక్స్ ఫోటోగ్రఫీ, కార్యవర్గ మరియూ బోర్డు సభ్యులకు, వాలంటీర్లకు, సభాముఖంగా సాయిరాం కారుమంచి ధన్యవాదాలు తెలిపి దిగ్విజయంగా ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected