Connect with us

Tollywood

పద్మభూషణ్ శివ రామ కృష్ణ మూర్తి ఘట్టమనేని మృతికి ‘తామా’ శ్రద్ధాంజలి

Published

on

తెలుగువీర లేవరా అంటూ అల్లూరి సీతారామరాజుగా తెలుగువారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సూపర్ స్టార్ కృష్ణ సినిమా ప్రపంచాన్ని కన్నీటి సంద్రంలో ముంచి వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తెలుగు సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం రోజు అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్ కు గురైన సూపర్ స్టార్ కృష్ణ కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ తరపున ఆకాంక్షించారు.

1942 మే 31 వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి మండలం లోని బుర్రిపాలెం గ్రామంలో వీర రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో కృష్ణనే అందరికంటే పెద్ద వాడు. సూపర్ స్టార్ కృష్ణ గా అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమాల పైన ఎనలేని మక్కువ. తల్లిదండ్రులు కృష్ణను ఇంజనీరింగ్ చదివించాలని ఎంతగానో ఆశపడినా, కృష్ణ కు మాత్రం మొదటి నుంచి నటన పైన ఎక్కువ ఆసక్తి ఉండేది.

ఇంజనీరింగ్లో కృష్ణకు ప్రవేశం లభించకపోవటంతో డిగ్రీ లో చేర్పించారు తల్లిదండ్రులు. ఏలూరు డిగ్రీ కళాశాలలో చదువుతున్న సమయంలో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు కు ఘన సన్మానం జరగగా, ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాల పైన మరింత ప్రేమ పెరిగింది. దీంతో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సినీ రంగం వైపు అడుగుపెట్టిన కృష్ణ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు చేశారు. తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన కృష్ణ 1967 లో బాపు-రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమా లో కృష్ణ కథానాయకుడిగా నటించారు.

తేనె మనసులు, గూఢచారి 116, జేమ్స్ బాండ్, ఇద్దరు మొనగాళ్ళు, మరపురాని కథ, ఇలా కృష్ణ సినీ ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. పండంటి కాపురం, గాజుల కిష్టయ్య, దేవుడు చేసిన మనుషులు, మాయదారి మల్లిగాడు, మోసగాళ్లకు మోసగాడు వంటి చిత్రాలతో పాటు అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సూపర్ స్టార్ కృష్ణ, నాలుగు దశాబ్దాలపాటు సాగిన తన సినీ కెరీర్లో 340 కి పైగా సినిమాలలో నటించారు. అల్లూరి సీతారామరాజు, సింహాసనం సినిమాలు ఆయనకు మరింత కీర్తిని తెచ్చిపెట్టాయి. తెలుగులో తొలి 70 ఎంఎం సినిమా సింహాసనం, తొలి సినిమా స్కోప్ సినిమా అయిన అల్లూరి సీతా రామ రాజును నిర్మించిన అరుదైన ఘనత కృష్ణ సొంతం చేసుకున్నారు. మొత్తం 55 సంవత్సరాల సినీ కెరీర్లో కృష్ణ సినిమా ప్రపంచంలో సాధించిన విజయాలు ఎన్నో. ఇక చివరిగా 2016 సంవత్సరంలో శ్రీ శ్రీ అనే సినిమాలో కృష్ణ నటించారు.

1970 లో పద్మాలయా సంస్థను స్థాపించారు. సంస్థ నిర్మాణం తరువాత విజయవంతమైన చిత్రాలు తీసిన కృష్ణ దర్శకుడిగానూ 16 సినిమాలను తెరకెక్కించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణ కే దక్కింది. సినీ రంగంలో విశేష సేవలు అందించిన సూపర్ స్టార్ కృష్ణకు పలు పురస్కారాలు వరించాయి. 2009వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం ఆయనను వరించగా, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, ఫిలింఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం సూపర్ స్టార్ కృష్ణకు లభించాయి.

సినీ జీవితంతో పాటు రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన కృష్ణ 1984వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పై అభిమానంతో, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృష్ణకు సన్నిహితుడు కావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో మరోమారు ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురికావడం తో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కృష్ణ రాజకీయాలలో ఎక్కువ కాలం నిలబడలేదు. కానీ సినిమా ప్రపంచంలో మాత్రం తనదైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని, అందరి మనసులలో సూపర్ స్టార్ గా నిలిచిపోయారు. కళామతల్లికి ఎనలేని సేవ చేసిన సూపర్ స్టార్ కృష్ణ ఆయన అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచి వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected