తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఇండియానా (Telugu Association of Indiana) క్రీడా కార్యక్రమాల షెడ్యూల్ గత నెలలో NRI2NRI.COM ప్రచురించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ప్రకారంగా సెప్టెంబర్ లో పలు దఫాలుగా వివిధ క్రీడా కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇందులో భాగంగా గత వారాంతం సెప్టెంబర్ 11న త్రోబాల్, చెస్ (Chess) క్రీడలు విజయవంతంగా నిర్వహించారు. త్రోబాల్ (Throwball) టౌర్నమెంట్లో కొలంబస్ ఇండియానా జట్టు మొదటి బహుమతి గెలుచుకోగా, ఇండియానా యూనివర్సిటీ విద్యార్థులు రెండవ బహుమతి గెలుచుకున్నారు.
ఇండియానాలోని వెస్ట్ ఫీల్డ్ నగరంలో 200 మంది ప్రేక్షకుల మధ్య నిర్వహించిన ఈ క్రీడలలో సుమారు 70 మంది పాల్గొన్నారు. వచ్చే సెప్టెంబర్ 18న అతిపెద్ద వాలీబాల్ (Volleyball) టోర్నమెంట్లో ఇండియానా జట్లతోపాటు, మిచిగన్ మరియు ఇలినాయిస్ రాష్ట్రాల నుంచి రానున్న జట్లు కూడా పాల్గొననున్నాయి.
సుమారు 150 మంది వాలీబాల్ క్రీడాకారులతోపాటు 500 మంది ప్రేక్షకులు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే సెప్టెంబర్ 25న మహిళలు, పురుషుల విభాగాలలో సుమారు 40 జట్లతో బాడ్మింటన్ (Badminton) టోర్నమెంట్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం విజేతలకు ట్రోఫీలు బహుకరించనున్నారు. ఈ క్రీడా కార్యక్రమాలన్నీ సజావుగా సాగేలా Telugu Association of Indiana అధ్యక్షులు మార్ రెడ్డి దొండేటి అధ్యక్షతన TAI కార్యవర్గ సభ్యులు అందరూ ఏర్పాట్లు చేస్తున్నారు.