Connect with us

Festivals

అలరించిన TAGB ఉగాది ఉత్సవాలు, బాహుబలి ఫేమ్ మౌనిమ చంద్రభట్ల సంగీత విభావరి

Published

on

మిల్ ఫోర్డ్ హైస్కూల్ ప్రాంగణం ఏప్రిల్ 29, 2023 మధ్యాహ్నం తెలుగుదనంతో, పండగ సందడితో తొణికిసలాడింది. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలకి దాదాపు 800 మంది హాజరుకాగా, నిరాఘాటంగా నిర్వహించిన 10 గంటల కార్యక్రమం ఆహుతులని అలరించింది.

వచ్చిన వారిని సాదరంగా ఆహ్వనిస్తూ, టి.ఏ.జి.బి కార్యవర్గం ఉగాది పచ్చడి, పానకం అందజేశారు. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొని, సాంప్రదాయ- సినీ పాటలు, నృత్యాలు, నాటికలు వంటి వైవిధ్య భరితమైన వినూత్న కార్యక్రమాలు ప్రదర్శించారు. వయో భేదం లేకుండా పిన్నా పెద్దా పాల్గొని అలరించి ఆనందించారు.

రకరకాల అంగడులు, కమ్మటి ఫలహారాలు పిల్లల సందడులుతో ప్రాంగణం కళకళ లాడింది. వినోదం విజ్ఞానం మేళవించిన కార్యక్రమం అని సభ్యులు కొనియాడారు. 2022-23 కొత్త గవర్నింగ్ బోర్డ్ సభ్యులని కొత్త కార్యవర్గాన్ని టి.ఏ.జి.బి అధ్యక్షురాలు శ్రీమతి పద్మజ బలభద్రపాత్రుని సభకు పరిచయం చేసారు.

కొత్త కార్యవర్గం :-
అధ్యక్షురాలు: పద్మజ బలభద్రపాత్రుని
ప్రెసిడెంట్ ఎలెక్ట్: దీప్తి గోరా
కార్య దర్శి: శ్రీనివాస్ గొంది
కోశాధికారి: శ్రీకాంత్ గోమట్టం
సాంస్కృతిక కార్యదర్శి: గాయత్రి అయ్యగారి

బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు:-
చైర్మన్; అనిల్ పొట్లూరి
వైస్ చైర్మన్: కృష్ణ మాజేటి
బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు: సీతారామ్ అమరవాది, రవీంద్ర మేకల, రమణ దుగ్గరాజు.

అధ్యక్షురాలు పద్మజ ఆహుతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉగాది ఉత్సవాలలో పాల్గొన్న అందరికీ మరియు తెలుగు నేర్చుకుంటున్న పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లి దండ్రులకు, పిల్లలకు తెలుగు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు, కృతజ్ఞతాభివందనములు అందించారు. “పిల్లలతో తెలుగులో మాట్లాడండి, తెలుగు నేర్పండి, ఆనందాన్ని అనుభూతుల్ని తెలుగులో పంచుకోండి.” అని చెప్పారు. తెలుగు పద్య పఠనం పోటీలలో పాల్గొన్న 40 పిల్లలకు బహుమతులు అందించారు.

సాంస్కృతిక కార్యదర్శి గాయత్రి అయ్యగారి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. వీనులవిందుగా “స్వరాత్మ”, మరియు వల్లి అమరవాది గారి నేపథ్యంలో “స్వరరాగలహరి” బృందం చేసిన అమృతగానం, “నారీ శక్తి, కళా తపస్వి విశ్వనాధ్, నటులు కృష్ణ, జమున గార్ల స్మృత్యంజలి, కోలాటం, ధర్మో రక్షతి రక్షితః” వంటి వైవిధ్యమైన అంశాలపై చేసిన సాంస్కృతిక నాట్య ప్రదర్శనలు, చిన్నారులు చేసిన ఇంకెన్నో ఉత్సాహ భరితమైన, ఉత్తేజ పూరితమైన సినీ నాట్యాలు ప్రేక్షకులని ఉర్రుతలూగించాయి.

“బాలలహరి” పిల్లల తెలుగు హాస్య నాటిక “అంతా తెలుగుమయం” అందరినీ కడుపుబ్బ నవ్వించింది. తెలుగు వ్యాకరణం ఎంత సునాయాసంగా, సరదాగా నేర్చుకోవచ్చో ఈ నాటిక ద్వారా పిల్లలు అందరికీ తెలిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమం, పద్మజ, శ్రీనివాస్ బలభద్రపాత్రుని గార్ల నేతృత్వంలో కూర్చుకున్న “భువన విజయం” పద్య నాటిక ప్రేక్షకులను మైమరిపింప చేసింది.

చక్కటి నటన, ఆహార్యం, పిట్ట కథలు, అత్యద్భుతమైన పద్య రత్నాలతో శ్రీ కృష్ణ దేవరాయలు, వారి అష్ట దిగ్గజాలు ఆహుతులను అలరింప చేశారు. బాహుబలి ఫేమ్ గాయని “మౌనిమ చంద్రభట్ల” చేసిన “’సంగీత విభావరి” అందరినీ ఉర్రూతలూగించింది. మౌనిమ చంద్రభట్లతో జత కట్టిన “శ్రీకాంత్ సందుగు” ప్రేక్షకులని మరింత ఉత్తేజ పరిచి ఆనందింపచేశారు. వ్యాఖ్యాత మరియు గాయని “సాహిత్య వింజమూరి” కార్యక్రమంలో మెరిసి మురిపించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected