Tampa, Miami, Florida: ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా, మయామి నగరాలలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా (TGFL) ఆధ్వర్యంలో బోనాల పండుగ అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఎత్తి పట్టేలా కోలాహలంగా జరుపుకున్నారు.
అన్ని వయస్సుల వాళ్ళు తమ కుటుంబసభ్యులతో పెద్ద సంఖ్యలో హాజరై అమ్మ వారికి బోనం సమర్పించి ఆశీర్వాదాలను పొందారు. ఈ వేడుకలో అమ్మవారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుష్పాలతో, కాంతులతో అలంకరించబడిన అమ్మవారి విగ్రహం భక్తుల మనసులను పరవశింపజేసింది.
భక్తులు ఆలయ మార్గంలో ఊరేగింపుగా బోనాలు సమర్పించడం ఒక ఆధ్యాత్మిక భావావేశాన్ని కలిగించింది. మహిళలు సంప్రదాయ వేషధారణలో బోనాలు (Bonalu) ఎత్తి పండుగ వాతావరణాన్ని మరింత వైభవంగా మార్చారు. చిన్నారుల నృత్యాలు, పాటలు, కుటుంబ సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు ఈ వేడుకలో ఉత్సాహాన్ని కలిగించాయి.
ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా పోతరాజు ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. పోతురాజు తన నృత్యంతో సందడి చేశాడు. TGFL అసోసియేషన్ అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ “తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలో కొత్త తరాలకు పరిచయం చేయడమే మా అసోసియేషన్ ప్రధాన లక్ష్యం.
పోతరాజు నుండి ఊరేగింపు వరకూ ప్రతి అంశం మన సంస్కృతికి అద్దం పడుతోంది. మాతృభూమికి దూరంగా ఉన్న మనల్ని ఇలాంటి పండుగలు ఒక్కదగ్గరికి చేర్చుతున్నాయి. ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం కాదు. ఇది సామూహికంగా మన పరంపరల్ని కాపాడే పండుగ.” అని తెలిపారు.
ఈ పందుగ సందడిలో మొత్తం తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా (TGFL)కమిటీ, తెలుగు కమ్యూనిటీ ఎంతో కష్టపడి విజయవంతంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవం అంతటా ఆనందం, భక్తి, తెలంగాణ సాంప్రదాయం (Telangana Culture) నిండుగా కనిపించింది.
ఈ పండుగ తెలంగాణ (Telangana) ప్రజల ఐక్యత, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా సాగింది. ప్రతి సంవత్సరం బోనాల పండుగ ఇంతే వైభవంగా జరుపుకుంటామని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా (TGFL)కమిటీ ప్రకటించింది.