Connect with us

Movies

Long Island, New York: నటి రోజా రమణికి జీవిత సాఫల్య పురస్కారం & స్వరమయూరి బిరుదు ప్రదానం

Published

on

గాన గంధర్వుడు, శ్రీ SP బాలసుబ్రమణ్యం గారి స్మరణ లో ఏర్పాటైన SPB మ్యూజిక్ అకాడమీ (SPBMA) ఆధ్వర్యంలో, ప్రముఖ నటి శ్రీమతి రోజారమణి గారి జన్మదిన వేడుకలు న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ (Long Island, New York) లో సెప్టెంబర్ 16, 2025, మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగాయి.

తెలుగువారి సమైక్య సౌభ్రాతృత్వాన్ని ప్రతిబింబిస్తూ, న్యూయార్క్ లోని ప్రముఖ సంస్థలు – తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం (TLCA), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (TTA), న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ల సహకారంతో, అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనానికి తెలుగు వారు విశేష సంఖ్యలో హాజరు అయ్యారు.

ఆరేళ్ళ వయసులోనే తన మొదటి సినిమా భక్త ప్రహ్లాద తో జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకుని, ఆరు దశాబ్దాల పాటు మరపురాని పాత్రలను పోషించడమే కాకుండా డబ్బింగ్ కళలోని అసాధారణ ప్రతిభతో జాతీయ అవార్డులు, నంది అవార్డులను అందుకొని దక్షిణ భారత సినిమారంగానికి ఆమె చేసిన అపూర్వమైన సేవలకు గాను, శ్రీమతి రోజా రమణీ (Roja Ramani) గారికి “స్వరమయూరి” బిరుదు తో బాటు జీవిత సాఫల్య పురస్కారం అందజేసి న్యూయార్క్ తెలుగు కళా సంఘాలు ఘనంగా సత్కరించాయి.

రోజారమణి గారు మాట్లాడుతూ… ఈ 66వ జన్మదినం మరియు సినీ ప్రస్థానంలో 60 వ వసంతం లోకి అడుగుపెట్టడం వంటి మైలురాళ్ళని ఈ ప్రతిష్టాత్మకమైన సంఘాల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానుల మధ్య జరుపుకోవడం సత్కారం గా కాకుండా అందరి ఆశీస్సులుగా భావిస్తున్నానని, ఇది తన జీవతం లోనే మరచి పోలేని సంవత్సరంగా నిలిచిపోతుంది అన్నారు.

ఈ వేడుకలకు ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ప్రముఖ గజల్ కవి శ్రీ రాజేష్ రెడ్డి గారిని కూడా ఘనంగా సన్మానించారు. శ్రీ రాజేష్ రెడ్డి గారు రచించిన గజల్‌లు జగ్జీత్ సింగ్, పంకజ్ ఉదాస్, భూపిందర్ సింగ్ వంటి లెజెండరీ గజల్ గాయకుల గళాల ద్వారా అమరత్వాన్ని సంతరించుకున్నాయి. శ్రీ రాజేష్ రెడ్డి గారు ఇంగ్లాండ్, అమెరికా, కెనడాలతో సహా అనేక దేశాలలో అనేక వేదికలపై భారతీయ సాహిత్యానికి ప్రాతినిధ్యం వహించారు.

54 ఏళ్ళ Telugu Literary and Cultural Association (TLCA) భవనం కలనీ నెరవేర్చడంలో సింహభాగం, ఐదు లక్షల డాలర్లకి పైగా విరాళం అందించిన డా. మోహన్ బాదే గారిని కూడా సన్మానించారు. రేలారే ఫేమ్ గంగ గారు, కిశోర్ కుంచెం గారు, నాగేంద్ర బుర్రాగారు, పాటలతో ఉత్సాహపరచారు.

ముందుగా అతిథులకు ఆహ్వానం పలికిన SPB మ్యూజిక్ అకాడమీ ఉపాధ్యక్షురాలు, శ్రీమతి రాజేశ్వరి బుర్రా గారు కార్యక్రమానికి సారధ్యం వహించి, తమ అధ్బుత వ్యాఖ్యానంతో, రోజారమణీ (Roja Ramani) గారి పాటలతో, కార్యక్రమాన్ని మనోరంజకంగా నడిపించారు. శ్రీమతి రోజారమణి గారి గురించిన విశేషాలు వివరించారు.

SPB మ్యూజిక్ అకాడమీ చైర్మన్ డాక్టర్ హరి ఇప్పనపల్లి గారు తమ సందేశంలో శ్రీమతి రోజా రమణి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యూ యార్క్ (New York) లో అన్ని తెలుగు సంస్థలు కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

SPB మ్యూజిక్ అకాడమీ అధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు మాట్లాడుతూ… USA లోనే చక్కని గాయనీ గాయకులను ప్రోత్సహించడం తమ సంస్థ ఆశయం అని వివరించారు. అలాగే, దూరాలనీ, ట్రాఫిక్ లను అధిగమిస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంస్థల నేతలకూ, వారి టీం సభ్యులకు పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మన తెలుగువారందరి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఈ సంస్థలంతా ఒక్కటై ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారని తెలిపారు.

జన్మభూమి భారతదేశంలో, కర్మభూమి అమెరికాలో తెలుగు సంస్కృతిని పరిరక్షిస్తూ, పెంపొందించడానికి కృషి చేస్తున్న తెలుగు సంస్థలకు దశాబ్దాలుగా విరివిగా విరాళాలు అందిస్తున్నన్యూయార్క్ మహాదాతలు డా. పైళ్ళ మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy) గారు, డా. పూర్ణ అట్లూరి (Dr. Purna Atluri) గారితో సహా ఆర్ధికంగా తోడ్పడుతున్నదాతలందరికీ శ్రీనివాస్ గూడూరు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విశేషంగా తోడ్పాటు అందించిన న్యూయార్క్ లోని ప్రముఖ సంస్థల ప్రతినిధులు – తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం (TLCA) నుండి చైర్-ఉమెన్ రాజీ కుంచం, ప్రెసిడెంట్ సుమంత్ రామిశెట్టి – ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) నుండి రీజనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస భర్తవరపు గారు, తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (TTA) నుండి నేషనల్ కోశాధికారి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సహోదర్ పెద్దిరెడ్డి, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ జయప్రకాష్ ఇంజపూరి – న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) నుండి వైస్ ఛైర్మన్ లక్ష్మణ్ ఏనుగు, ప్రెసిడెంట్ వాణి ఏనుగు గారలు, వారి కార్యవర్గ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

శ్రీమతి రాజేశ్వరి బుర్రా గారు వందన సమర్పణ చేస్తూ… ఈ కార్యక్రమ విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడ్డవారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తెల్లవారి మళ్ళీ వర్క్ ఉన్నా దాదాపు నాలుగు గంటలు జరిగిన ఈ కార్యక్రమం చివరి వరకూ ఉండి, ఉత్సాహంతో తిలకించిన ప్రేక్షకమహాశయులకు కృతజ్ఞతలు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected