మ్యూజిక్ డైరెక్టర్ “కోటి” సంగీత దర్శకత్వం వహించి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంటులో లాంచ్ చేసిన “మగువల మనసులే” పాటను రాసిన “తేజాంజలి” ఒక గాయని, రచయిత మరియు కంపోజర్. బాల్యం నుంచే తేజాంజలికి మ్యూజిక్ పట్ల ఎంతో ఆసక్తి ఉండడం వల్ల తనలో ఉన్న ఈ “3 మ్యూజిక్ స్కిల్స్” ప్రపంచానికి తెలియాలి అనే సంకల్పంతో, పట్టుదలతో తానే సొంతంగా పాటలను కంపోజ్ చేసి, రచించి, పాడి “Youtube” లో “ఆల్బమ్ సాంగ్స్” గా రిలీజ్ చేసింది.
ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని అనుకున్న ఆశయం సాదించడం కోసం ఎంతో శ్రమించింది. కష్టపడి పని చేస్తే ఆ భగవంతుడే దిగివచ్చి దారి చూపుతాడని మ్యూజి క్ పట్ల ప్రయత్నిస్తూనే ఉంది. ఇలా జరుగుతుండగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు, తేజాంజలి చేసిన ఆల్బమ్స్ చూసి తన టాలెంట్ ను గుర్తించారు.
ఒక వ్యక్తిలో 3 మ్యూజిక్ స్కిల్స్ (పాటను కంపోజ్ చేయడం, పాటను రాయడం, పాటను పాడడం) ఉండడం అనేది చాలా అరుదు, ఎంతో గొప్ప విజయాన్ని సాధిస్తావు, ఒక టాలెంటెడ్ ఉమెన్ గా పేరు ప్రఖ్యాతలను పొందుతావు అని తనను ప్రోత్సహించి ఆయన దగ్గర అసిస్టెంట్ గా పని చేసే అవకాశాన్ని ఇచ్చారు.
ఆయన దగ్గర పనిచేస్తుండగా ఒకరోజు తేజాంజలితో ఉమెన్ ఎంపవర్ మెంట్ మీద పాట రాయాలి. జీవితంలో ఎన్నో కష్టాలను చూసి వాటిని తట్టుకుని ఎదిగిన నువ్వు ఈ పాటను రాసి అందరికీ ఆదర్శంగా నిలవాలి. ఆడది తలచుకుంటే ఏదైనా సాధించగలదు అనే నీ నమ్మకం, సంకల్పబలం ఈరోజు నిన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిందని ప్రపంచమంతా తెలియాలి అని కోటి గారు చెప్పగా, దానికి ఆమె ఎంతో సంతోషించి తన జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకుని ఈ “మగువల మనసులే” పాటను రాసానని తేజాంజలి చెప్పుకొచ్చారు.
తనను గుర్తించిన గురువు గారు కోటి గారికి జీవితాంతం ఋణపడి ఉంటానని, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహానుభావుడి దగ్గర పనిచేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, తన జీవితంలో గెలుపుకి ఆయనే కారణమని తేజాంజలి తెలియజేశారు.