అన్నపూర్ణగా వడ్డించి, అల్లరి పందిరి కింద ఆడించి, అత్యద్భుత ఆతిథ్యమిచ్చి, మరువరాని మధురానుభూతిలా మురిపించి మైమరిపించిన ఆ అరుణం తెలుగు వారు తరియించిన వైనం Telangana Development Forum (TDF) Atlanta గర్వించిన తరుణం.
TDF అట్లాంటా గత ఆరు సంవత్సరాలుగా తీయని మాటలతో, కమ్మని వంటకాలతో, సరదాల సేద తీర్చి, ఆత్మీయతతో అబ్బురపరిచేలా నిర్వహిస్తున్న చెట్ల కింద వంట కార్యక్రమం ఈ ఏడాది మే 14, 2022 న Buford Dam Road నందున్న సరస్సు ఒడ్డున నిర్వహించింది. తరతరాల భారత దేశ బలమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థలా మహోన్నత శక్తుల మమేక సారం TDF సంస్థ.
సుమారు 800 పైగా ఆత్మీయ అతిథులతో కళకళలాడిన ఆ పర్వదినం నిర్వాహకులకు అంతులేని సంతృప్తిని కలిగించింది అనడంలో అతిశయోక్తి లేదు. అట్లాంటాకు విరివిగా వలస వస్తున్న నేపథ్యంలో కొత్త నీరై పారుతున్న తెలుగు వారికి అభిమాన అహ్వానంగా ఆత్మీయ ఆలింగనంగా నిలిచింది చెట్ల కింద వంట కార్యక్రమం అని పలువురిచే కొనియాడబడటం సంస్థ యొక్క నిర్వహణా నైపుణ్యాన్ని చాటుతుంది.
ప్రణాళికను మొదలుకొని ఆచరణ, నిర్వహణ మరియు ప్రశంసల, మన్ననల విజృంభణ చవిచూడు వరకు అకుంఠిత సంకల్పంతో అవిశ్రాంత సమిష్టి కృషితో, BOT‘s బాపురెడ్డి కేతిరెడ్డి మరియు స్వాతి సుదిని గార్ల సారథ్యంలో, President స్వప్న కస్వా నేపథ్యంలో, EC బోర్డు సభ్యులు మరియు కోర్ టీం సభ్యులు,స్నేహితుల సహకారంతో నిన్నటి వనితా డే 2022 ను మొదలుకొని, ఇప్పటి చెట్ల కింద వంట కార్యక్రమాన్ని కలుపుకుని, రేపటి బతుకమ్మ సంబరాల వరకూ తమ అద్వితీయ నిర్వహణతో అందరి ఆదరాభిమానాలను కైవశం చేసుకోబోతోంది అని ప్రగాఢ విశ్వాసాన్ని చాటుకుంది TDF మరొక్కమారు.
ఈ కార్యక్రమంలో ఆద్యంతం చేదోడు వాదోడుగా నిలిచి పలు సంస్థల ప్రతినిధులు మరియు సభ్యులు అందచేసిన అభిమానపూరిత సహకారం, స్నేహం అత్యున్నత బలం అనే మాటకు నిదర్శనం. పురుషులు నలభీములై పాకాలను ఘుమఘుమలాడించగ, స్త్రీమూర్తులు అన్నపూర్ణలై కమ్మదనాన్ని రంగరించగ సుమారు 20 రకాల నోరూరే శాఖాహార, మాంసాహార వంటకాలతో అతిథులకు భుక్తాయాసం తప్పలేదు.
అంతలో అల్లరికి ఆహ్లాదానికి మాటల రూపమైన లావణ్య గూడూరు తన ఆటపాటల నిర్వహణా నైపుణ్యంతో అందరి ఉత్సాహాన్ని రెట్టింపుచేసింది. ఇక కొసమెరుపైన వేడి వేడి మిరప కాయ బజ్జీల సందడి సాటిలేని సాయంత్రానికి సంతకంగా నిలిచింది.
ఇంత అద్వితీయ కార్యక్రమ నిర్వహణలో మంచి మనస్సుతో ముందుకొచ్చి తమ వంతు సహకారాన్ని అందించిన Suvidha, Deccan Spice, DJ దుర్గం, లావణ్య గూడూరు మరియు ఇతరేతర వదాన్యులకు, స్వచ్ఛందకారులకు ఈ సందర్భంగా TDF తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంది.
సకల కళాపోషణ TDF నెరవేరుస్తున్న తెలుగు వారి కల అంటూ వినూత్న ఉత్సాహంతో దూసుకెళ్తున్న శ్రీమతి స్వప్న కస్వా మాట్లాడుతూ సంస్థ మరియు జనం అన్నివేళలా తన సంకల్పాలకు తమ సహకారాన్ని అందజేయగలరని కోరుతూ మొరొక్కమారు ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.