Dallas, Texas: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ (TANTEX) సాహిత్య వేదిక ”నెల నెలా తెలుగు వెన్నెల” 224వ సాహిత్య సదస్సు 2026 మార్చి నెల 22 వ తేదీన ఆదివారం నాడు డాలస్, టెక్సాస్ నగరము నందు గల సమావేశ మందిరము వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. షాడో మధుబాబు గారి ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా అలరించింది.
సాహిత్య వేదిక సమన్వయ కర్త మరియు పాలకమండలి అధిపతి దయాకర్ మాడా (Dayakar Mada) స్వాగత వచనాలు పలుకుతూ సాహిత్య వేదిక గత 18 ఏళ్ళుగా క్రమం తప్పకుండా ప్రతి 3 వ ఆదివారం సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా, తెలుగు భాషా సాహిత్యాలని సుసంపన్నం చేసిన ఎందరో మహామహులు ఈ వేదికని అలంకరించారని, అలాగే ఎన్నో సాహిత్య ప్రక్రియల ప్రదర్శన జరిగిందని తెలియజేసారు.
గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమ నిర్వహణ తనకెంతో తృప్తి నివ్వడమే కాక, ఎంతో మంది సాహితీ ఉద్దండులతో సాన్నిహిత్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు. తొలుత ”రామా నన్ను బ్రోవరా” అంటూ ప్రార్ధన గేయాన్ని చిరంజీవి కుమారి సమన్విత మాడా వీనుల విందుగా ఆలపించడంతో నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సును ప్రారంభించడం జరిగింది.
టాంటెక్స్ 224వ సాహితీ సదస్సుకు గాను ప్రముఖ కవి కీ శే వడ్డేపల్లికృష్ణ వ్రాసిన ”నెల నెలా-తెలుగు వెన్నెలా ” గీత వైశిష్ట్యాన్ని సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా కొనియాడి, ఆ సుమధుర గీతాన్ని మరొకసారి వినిపించడం జరిగింది. తరువాత దయాకర్ మాడా తొలిపలుకులలో నాటి ముఖ్య అతిథి షాడో మధుబాబు జీవన ప్రస్థాన, విద్యార్థి దశ విశేషాలు మొదలుకొని నవలా రచయిత గా వారు సాధించిన అనేక ఆసక్తికరమైన విజయాలను వివరించారు.
ఆతరువాత గత శతాబ్ది డెబ్బైయవ దశకంలో డిటెక్టివ్ ”షాడో ”మధుబాబు గా పాఠకులను అలరించిన వల్లూరు మధుసూదన రావు యాభై ఏళ్ళ తమ అనుభవాలను తన రచనా విశేషాలను జూమ్ వేదికగా వివరించారు. తనకంటే ముందుగా నవలా సాహిత్యాన్ని సృష్టించిన విశ్వనాధ సత్యనారాయణ, అడవి బాపిరాజు, నోరి నరసింహ శాస్త్రి గార్ల చారిత్రక నవలలు, శరత్ సాహిత్యం, మద్రాసులో తాను ఉన్నపుడు అమెరికన్ లైబ్రరీ లో చదివిన ఆంగ్ల సాహిత్యం (English Literature), కాశి మజిలీ కథలు, జానపదకథలు తాను రచయితగా ఉద్భవించడానికి దోహదం చేసినట్లు పేర్కొన్నారు.
గత అరవై సంవత్సరాలుగా తాను వ్రాస్తూనే ఉన్నాననీ ”డిటెక్టివ్ షాడో ”సృష్టికర్తగా ఆబాలగోపాలం తనను అభిమానించారనీ డిటెక్టివ్ నవలా యుగం అంతరించాక జానపద నవలా రచననను కొనసాగించి అనేక తెలుగు (Telugu) దిన, వార, మాస పత్రికా పాఠకుల అభిమాన రచయితగా స్థిరపడి నిరంతరం రచయిత గానే కొనసాగుతూ ఉన్నాననీ తన తుదిశ్వాసవరకూ రాస్తూనే ఉంటాననీ ఘంటాపథంగా నొక్కి వక్కాణించారు.
అధ్యయనం, అభ్యాసం, ఊహాశీలత ఉన్నపుడే రచయిత తన రచనలతో పాఠకులను రంజింప చేయగలడని అన్నారు.సభాద్యక్షత వహించిన దయాకర్ మాడా (Dayakar Mada) అడిగిన ప్రతి ప్రశ్నకూ మధుబాబు ఓపికగా సవివరాణాత్మక జవాబులు చెప్పడం జరిగింది. అడిగినదే తడవుగా వెనుకకు తిరిగి చూడకుండా నవలలు వ్రాయగల తన సమర్ధత ను ప్రస్ఫుటం చేస్తూ ఆశువుగా చెప్పిన ఆయన సమాధానాలు విని సాహితీ ప్రియుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.
సాహితీ ప్రియుల హర్షధ్వానాల మధ్య దయాకర్ మాడ సంస్థ అధ్యక్షుల వారి తరపున ముఖ్య అతిథికి గౌరవసూచకంగా టాంటెక్స్ (Telugu Association of North Texas – TANTEX) సంస్థ బహూకరించే ప్రశంసా పత్రాన్ని చదివి వినిపించారు. ఈ సమావేశంలో ”సాహిత్యంలో చమత్కారాలు” అనే అంశంపై డాక్టర్ బీరం సుందరావు ప్రసంగించారు. ప్రముఖ కవి త్యాగరాజు తన మధుర కంఠంతో నాటక శైలి లో పద్యాలు పాడి వినిపించారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ (TANTEX) ప్రస్తుత అధ్యక్షులు శ్రీమతి మాధవి లోకిరెడ్డి (Madhavi Lokireddy) షాడో మధుబాబు రచనా పటిమను ప్రశంసిస్తూ జూమ్ ద్వారా ప్రసంగించారు. మధుబాబును అభిమానించే అక్కిరాజు సుందర రామకృష్ణ తన పాండిత్య ప్రతిభను కీర్తిస్తూ తన కంచు కంఠంతో పద్యాలు పాడి సాహితీ ప్రియులను రంజింప చేశారు.
సాహితీ ప్రియులనేకమంది వారి వారి స్పందనలను వినిపించారు. డాక్టర్ తోటకూర ప్రసాద్ (Dr. Prasad Thotakura), ప్రొఫెసర్ డాక్టర్ పూదూరు జగదీశ్వరన్, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, లెనిన్ వేముల, సతీష్ బండారు, కిరణ్ నిడిగంటి, పవన్ నర్రా, లెనిన్ బందా, ఎస్.కె ఎస్.రాజు, రామ్ డొక్కా ఇంకా డాక్టర్ బల్లూరి ఉమాదేవి, చంద్రహాస్ మద్దుకూరి, అనంత్ మల్లవరపు, చిన్న సత్యం వీర్నపు (ChinaSatyam Veernapu), చంద్ర కాటుబోయిన, హరి సింగం, నవీన్ గొడవర్తి, నిడిగంటి గోవర్ధన రావు వంటి అనేకమంది అశేష సాహితీ ప్రియులు వీక్షించడంతో సాహితీ సదస్సు విజయవంతమైంది.
వందన సమర్పణ గావించిన దయాకర్ మాడ (Dayakar Mada) సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. నేటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్సు (Telugu Association of North Texas – TANTEX) ప్రస్తుత అధ్యక్షులు శ్రీమతి మాధవి లోకిరెడ్డి, సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు.