Dallas Fort Worth, Texas: డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ ”నెలనెల తెలుగు వెన్నెల” , తెలుగు సాహిత్య వేదిక 218 వ సాహిత్య సదస్సు సెప్టెంబర్ 21వ తేదీ న ఆదివారం నాడు డాలస్ పురము నందు ఘనంగా నిర్వహించబడింది. తొలుత ”హిమగిరి తనయే…. ” అంటూ ప్రార్ధన గీతాన్ని చిరంజీవి సమన్విత మాడా వీనుల విందుగా ఆలపించడంతో సదస్సు ను ప్రారంభించడం జరిగింది.
సంస్థ సమన్వయ కర్త దయాకర్ (Dayakar Mada) మాడా స్వాగత వచనాలు పలుకుతూ సాహిత్య వేదిక గత 18 ఏళ్ళుగా క్రమం తప్పకుండా ప్రతి 3 వ ఆదివారం సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా, తెలుగు భాషా సాహిత్యాలని సుసంపన్నం చేసిన ఎందరో మహామహులు ఈ వేదికని అలంకరించారని, అలాగే ఎన్నో సాహిత్య ప్రక్రియల ప్రదర్శన జరిగిందని తెలియజేసారు.
గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమ నిర్వహణ తనకెంతో తృప్తి నివ్వడమే కాక, ఎంతో మంది సాహితీ ఉద్దండులతో సాన్నిహిత్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం శతజయంతి జరుపుకోనున్న ప్రముఖ కవి ఆలూరి బైరాగి (Aaluri Bairagi) గారి నాక్కొంచెం నమ్మకమివ్వు కవిత చదివి వారికి స్మృతి ఘటించారు. ఈ కవితకు తనకు గల సంబందాన్ని, తను ఇంజనీరింగ్ విద్యార్ధిగా ఉన్నప్పుడు దానికి రాసిన పారడీ గురించి గుర్తుచేసుకున్నారు.
తరువాత డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి (Dr. Narasimhareddy Urimindi) గారు మన తెలుగు సిరిసంపదలు పేరిట పద ప్రహేళికల కార్యక్రమం నిర్వహించారు. శ్రీ దయాకర్ మాడా ముఖ్య అతిథి డాక్టర్ వోలేటి పార్వతీశం గారిని పరిచయం చేస్తూ ప్రసార మాధ్యమంలో దాదాపు నాలుగున్నర దశాబ్దాల అవిశ్రాంత ప్రస్థానం ఓలేటి వారిదనీ , మధురమైన కంఠస్వరం పార్వతీశం గారి చిరునామా అనీ, విషయాన్ని విపులీకరిస్తూ సులభగ్రాహ్యంగా, ఆహ్లాదకరంగా మాట్లాడటంలో పార్వతీశం గారు అగ్రగణ్యులనీ.
ఉభయ రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలోనూ సాంస్కృతిక వేదికలపైనా , విశ్వవిద్యాలయ సదస్సులలోను , కళాశాల వేదికలపైన దాదాపు ఎనిమిది వేలకుపైగా ప్రసంగాలు చేసిన ఘనత పార్వతీశం గారిదనీ వందలాది సన్మానాలు, సత్కారాలు అందుకున్నారనీ పేర్కొన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ వోలేటి పార్వతీశం గారు ‘మహాకవి దాశరథి (Dasarathi) జీవితము సాహిత్యము ‘ గురించి అనర్గళంగా మాట్లాడుతూ వారి సాహిత్యాన్ని అంతకు మించి వారి జీవితాంతం దేశం కోసం, అణగారిన ప్రజల కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ వారికి రావలసినంత గుర్తింపు రాలేదని పేర్కొన్నారు.
శతజయంతి సందర్భంగా మనము పునరాలోచించుకోవాలని, వారి సేవలని, భాషా నిరతిని స్పూర్తిగా తీసుకోవాలన్నారు. ”’దేశ భాషలందు తెలుగు లెస్స” అని నుడివిన శ్రీ కృష్ణ దేవరాయల కాలమునుండి సాహిత్య పరంగా వాడుకలోనున్న తెలుగు భాష ను ఉదాహారణలతో చెప్పడం ప్రారంభించి మహాకవి దాశరథి వ్రాసిన నర్మ గర్భిత కవితల లోనూ ,సుమధుర గేయాలలోనూ దొర్లిన ఆ ణిముత్యాల్లాంటి పదాలనూ ఉదహరిస్తూ మహాకవి దాశరథి కవిత్వంలో విప్లవాత్మక భావాలు ప్రతిబింబించిన వైనాన్ని సోదాహరణంగా వివరిస్తూ అద్భుత ప్రసంగ చేశారు.
అలాగే రేడియో లో దాశరధి గారితో కలిసి పని చేసిన అనుభవాలనూ పంచుకున్నారు. ప్రముఖ సాహితీ విశ్లేషకులు శ్రీ లెనిన్ గారు అప్పుడే పూర్తైన దాశరథి పై పార్వతీశం (Parvateshwaram) గారి ప్రసంగానికి పొడిగింపుగా దాశరథి గారే రాసిన సుప్రసిద్ధ “మహాంధ్రోదయ” గేయాన్ని అద్భుతంగా పాడి వినిపించడం జరిగింది. “ఎన్ని నాళ్ళకు తెల్లవారెను” అనే గేయం ఆంధ్ర ప్రదేశ్ అవతరించిన సందర్భంలో అమితానాందానికి గురై “మహాంధ్రోదయం” అనే శీర్షికన ఉప్పొంగిన హృదయంతో
దాశరథి (Dasarathi) గారు రాసిన గేయమనీ దానిలో కవి గారు “అన్నీ నేనే , అంతా నేనే , తెలుగు నేనే, వెలుగు నేనే” అంటూ తెలుగు జాతి వైభవాన్ని మహోన్నత రీతిలో అభివర్ణించారనీ నేడు తెలుగు రాష్ట్రాలు మాండలికాల ఆధారంగా విడిపోయినా భాష మనలందరినీ ఏకతాటి పై నిలుప గలదు అనే ఉజ్వల సందేశం ఆ మహాకవి గేయంలో అన్ని కాలాలలో కూడా మారు మ్రోగుతూనే ఉంటుంది అనీ పేర్కొన్నారు.
“గని మాట-పాట” అన్న అంశం పై ముఖ్య అతిధి ప్రసంగం చేసిన సుప్రసిద్ధ ప్రజానాట్యమండలి గాయకులు, తెలుగు నాట అభ్యుదయ గేయాలకు పేరున్న ఉత్తమ శ్రేణి కళాకారులు గని గారు స్వయంగా తన సుదీర్ఘ కళా ప్రస్థానంలో పాడిన అత్యుత్తమ గేయాలను కొన్ని పాడి వినపించారు. మాయమైపోతున్న మానవతా విలువలను గుర్తుచేస్తూ “మాయమై పోతున్నడమ్మా”, దైనందిన సమాజంలో చోటుచేసుకొనే పలు అంశాల యొక్క పేర్లు పైకి ఒకవిధంగా పిలవబడుతున్నా
అంతర్లీనంగా అవి సమాజం పై చూపే అసమ రీతి ప్రభావాల దృష్ట్యా వాటిని వేరే విధంగా పిలవాలి అంటూ “దృష్టిని బట్టి వినిపించేను సృష్టిని విన్నాను” అంటూ పాడి లోతైన భావాలను రాగయుక్త గానంతో విడమరచి చెప్పారు. తనకు ముందు ప్రసంగించబడిన దాశరథి సాహిత్యం స్పూర్తి తోనే గని గారు తెలుగు నాట మూలమూలలా సుపరిచయమైన మహాకవి దాశరథి వారి “ఆ చల్లని సముద్ర గర్భం” ఆలపించి అభ్యుదయ గేయాలకు ముందు వరసలో ఆ గేయమెందుకున్నదో తన మాటల ద్వారా ఆ పాట వైభవాన్ని వివరించారు.
చివరి పాటగా వేములపల్లి శ్రీకృష్ణ గారు రాసిన అజరామర తెలుగు జాతీయగేయం ” చెయ్యెత్తి జైకొట్టి తెలుగోడా” గేయాన్ని ఆలపించి ఉత్తేజ పరచారు. ఆద్యంతం సమాజాన్ని ఉద్ధరించే సందేశాత్మక అంశాలనే స్పృశిస్తూ అపారమైన తన ఐదు దశాబ్దాల అనుభవాన్ని రంగరిస్తూ , గేయాలాలపించి రంజింపజేసారు.
తరువాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి (Chandrasekhar Pottipati) తరపున సంస్థ సమన్వయ కర్త శ్రీదయాకర్ మాడ నేటి ముఖ్య అతిథులుడాక్టర్ వోలేటి పార్వతీశంగారినీ ,శ్రీ గని గారినీ టాంటెక్స్ సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి ఘనంగా సన్మానించడం జరిగింది.
ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈసన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొంటూ వారిద్దరూ తమ కృతజ్ఞతను వెలిబుచ్చడం జరిగింది. ముఖ్య అతిథులైన డాక్టర్ వోలేటి పార్వతీశం,శ్రీ గని గార్ల కుటుంబ సభ్యులు , డాక్టర్ ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura),డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి,శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ
మరియు శ్రీ చిన్న సత్యం వీర్నాపు వంటి సంస్థ పూర్వ అధ్యక్షులతో పాటు ,ప్రొఫెసర్ రామ్ దంతు,ప్రొఫెసర్ పుదూరు జగదీశ్వరన్,శ్రీ చంద్రహాస్ మద్దుకూరి,శ్రీ మాడిశెట్టి గోపాల్, శ్రీ లెనిన్ బంద, శ్రీమతి గౌతమీ మాడ ,శ్రీమతి లక్ష్మి యద్దనపూడి, శ్రీ లెనిన్ వేముల, శ్రీమతి విజయ మామునూరి,శ్రీమతి సరోజ కొమరవోలు, శ్రీ గోవర్ధనరావు నిడిగంటి వంటి అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొని వీక్షించడంతో సదస్సు విజయవంతమైంది.
వందన సమర్పణ గావించిన దయాకర్ మాడ (Dayakar Mada) సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. నేటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సమన్వయ కర్త దయాకర్ మాడా సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు.