ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ‘టాంటెక్స్’ ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 23న జరిగిన 15వ వార్షికోత్సవం మరియు 180వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం సెయింట్ మేరీస్ మళంకర చర్చిలో సాహితీ బంధువులందరి మధ్య సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనం చాలా వైభవంగా జరిగింది.
సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు నమస్కారములు తెలిపారు. నెల నెలా తెలుగు వెన్నెల పుట్టు పూర్వోత్తరాలను అందరికీ గుర్తు చేసారు. 2022 సంవత్సరంలో జరిగిన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. నెల నెలా తెలుగు వెన్నెల 15వ వార్షికోత్సవానికి విచ్చేసిన విశిష్ట అతిథులు, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్య వర్గ బృందం, సాహితీ ప్రియులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రముఖ గాయని శ్రీమతి ఆశా కీర్తి గారి పిల్లలు శ్రీకరి లంక, కేశవ లంక వినాయకుడిని పూజిస్తూ తమ మధుర గాత్రంతో వీనుల విందుగా పాడి సాహితీ ప్రియులను పరవశింప చేశారు.
శ్రీ చక్ర కళానిలయం స్థాపకులు శ్రీమతి స్వప్నశ్రీ చకోటి గారి శిష్య బృందం గురువులందరికీ బ్రహ్మాంజలి పేరుతో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు. సాయి నృత్య అకాడమీ స్థాపకులు శ్రీమతి శ్రీదేవి ఎడ్లపాటి గారి శిష్య బృందం శ్రీకృష్ణ భగవానుడిని పూజిస్తూ “అలోకయే శ్రీ బాలకృష్ణం” అని కూచిపూడి నాట్యం చేసారు. తరువాత రాగ మయూరి స్కూల్ ఆఫ్ డాన్స్ మరియు యోగ స్థాపకులు సింధూజ ఘట్టమనేని గారి శిష్య బృందం వినాయకుడిని, దుర్గా దేవిని, శ్రీరాముడిని పూజిస్తూ “శ్రీ విఘ్న రాజం భజే” అంటూ భరతనాట్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన 15వ వార్షికోత్సవానికి విచ్చేసిన అతిథి శ్రీ పేర్ల ప్రభాకర్ గానికి సభకు పరిచయం చేసి వారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు శ్రీ పేర్ల ప్రభాకర్ గారు “నాడు-నేడు” అంశం మీద తెలుగు సినీ రంగానికి చెందిన అలనాటి ఆణిముత్యాలను గుర్తు చేసుకుంటూ సరదాగ తమ ప్రసంగాన్ని వినిపించారు. డా.ఊరుమిండి నరసింహారెడ్డి గారు “కోమల సాహితీవల్లభ”, “గీతపద్యావిధాత” డా. కోడూరి ప్రభాకర రెడ్డి గారిని పరిచయం చేస్తూ వారిని అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు ఆహ్వానించారు. డా. కోడూరి ప్రభాకర్ రెడ్డి గారు “శ్రీనాధుడి చాటువులు” అంశం మీద చక్కగా ప్రసంగించారు. కవి సార్వభౌముడు శ్రీనాధుడి జీవితంలో నుండి వారి చాటువులను గుర్తు చేసారు. ప్రముఖ సాహితీ విశ్లేషకులు శ్రీ లెనిన్ వేముల గారు ఒకే ఒక్క అచ్చ తెలుగు అవధాని డా. శ్యామలానందప్రసాద్ గారి పరిచయం చేస్తూ వారిని వేదిక మీదకు సగౌరవంగా అహ్వానించారు. డా. శ్యామలానందప్రసాద్ గారు “తెలుగు సాహిత్యంలో హాస్యం” అన్న అంశం మీద చక్కగా ప్రసంగించి తన అద్భుతమైన ప్రసంగముతో సభికులను ఆకట్టుకున్నారు.
ఆధునిక సహజ పండితులు డా. ఊరుమిండి నరసింహారెడ్డి గారు నెల నెలా నిర్వహిస్తున్న “మన తెలుగు సిరిసంపదలు” కార్యక్రమములో పొడుపుకథల మిళితమైన పద్యాలు ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులను ఆలోచింపచేసి వారినుండి సరియైన సమాధానాలను రాబట్టే ప్రయోగం కొనసాగించారు. హాజరైన వారందరి మెదడుకు మేత వేసి సాహితీ ప్రియులలో ఉత్సాహాన్ని నింపి అందరి ప్రశంసలనందుకొన్నారు. సాహితీ ప్రియులైన చంద్రహాస్ మద్దుకూరి గారు సభకు డా.కోమలరాణి గారిని పరిచయం చేసారు. డా. కోమలా రాణి గారు గుంటూరుకి చెందిన నరసింహ దీక్షిత శర్మ గారి సాహితీసేవలను సభకు వివరించారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ ఉమామహేష్ పార్నపల్లి గారు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభకు విచ్చేసిన వారందరికీ విందు భోజనం అందించిన చౌరస్తా రెస్టారెంట్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం నెలనెలా తెలుగు వెన్నెల 15వ వార్షికోత్సవానికి సభాస్థలం అందించిన సెయింట్ మేరీస్ మళంకర చర్చి వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు.
డా. ప్రసాద్ తోటకూర గారు విశిష్ట అతిథి డా. కోడూరి ప్రభాకర రెడ్డి గారిని శాలువతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ ఉమామహేష్ పార్నపల్లి గారు విశిష్ట అతిథి ప్రభాకర్ పేర్ల గారిని శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు. డా. సత్యం ఉపద్రష్ట గారు విశిష్ట అతిథి డా. శ్యామలానందప్రసాద్ పాలపర్తి గారిని శాలువతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ప్రపంచంలో ఒకే ఒక్క అచ్చ తెలుగు అవధాని గారి సాహిత్య సంపదను కొనియాడుతూ వారిని “అవధాన కళాయశస్వి” బిరుదుతో సత్కరించారు.