Connect with us

Literary

ముఖాముఖీగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ‘టాంటెక్స్’ 177వ సాహితీ సదస్సు

Published

on

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 10న జరిగిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ‘టాంటెక్స్’ వారి 177 వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. కోవిడ్ వలన గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జూం లో జరుపుకుంటూ వస్తున్నారు. ఈసారి అందరి సమక్షంలో ముఖాముఖీగా మరియు జూం తో కలిపి అహ్లాదంగా నిర్వహించారు.

సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన అంతర్జాలంలో మరియు సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు నమస్కారములు తెలిపారు. అంతర్జాలంలో గోవర్ధనరావు నిడిగంటి, రాధ కాశీనాధుని, శారద సింగిరెడ్డి, లక్ష్మి పాలేటి గారు పాల్గొన్నారు. నెల్లూరులోని దొడ్ల కౌశల్యమ్మ మహిళా కళాశాల తెలుగు అధ్యాపకులు కోటేశ్వరరావు పుట్టమరాజు గారు కూడా జూం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం పూర్వాధ్యక్షులు లక్ష్మి పాలేటి గారు స్వయంగా చేసిన వడపప్పు, పానకం తీసుకు వచ్చారు. అలాగే ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఎగ్జిక్యూటివ్ కమీటీ సభ్యులు మాధవి లోకిరెడ్డి గారు భద్రాచలం నుండి సీతారాముల కళ్యాణం లడ్డుని సభకు విచ్చేసిన వారికి పంచారు.

చిన్నారులు సింధు, సాహితీ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా “రామ రారా సీతారామ రారా వేగ రారా మమ్ము బ్రోవరారా?” అంటూ చక్కగా ఆలపించారు. ప్రతి నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో సత్యం ఉపద్రష్ట గారు రాధ కాశీనాధుని గారు కలిసి పద్య సౌగంధం శీర్షిక నిర్వహిస్తున్న సంగతి మనదరికీ తెలిసిందే. ఈ నెల రాధ గారు నంది తిమ్మన గారి పారిజాతాపహరణంలోని పద్యాలని చక్కగా పాడి వినిపించారు. కవి సమ్మేళనంలో భాగంగా లెనిన్ వేముల గారు భాస్కర రామాయణం నుండి మనసును రంజింపజేసే కొన్ని కీర్తనలు రమ్యంగా పాడి అందరినీ అలరించారు.

ఆధునిక సహజ పండితులు డా.నరసింహారెడ్డి ఊరుమిండి గారు గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న “మన తెలుగు సిరిసంపదలు” కార్యక్రమంలో పొడుపుకథల మిళితమైన పద్యాలు, చమత్కార పదాలు ఉండే శ్లోకాలు, పదభ్రమకాలు సోదాహరణంగా వివరిస్తూ సభికులకి ప్రశ్నలు సంధించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం పాలక మండలి సభ్యులు అనంత్ మల్లవరపు గారు ప్రముఖ కవి గుజ్రాల్ గారి ఉర్దూ కవిత్వాన్ని కవి సమ్మేళనం భాగంగా చదివి వినిపించారు. 2010 నుండి జరుగుతున్న మాసానికో మహనీయుడు శీర్షిక కింద అరుణ జ్యోతి గారు ఏప్రిల్ నెలలో గుర్తు చేసుకోదగిన కవులు, రచయితలను ఉద్దేశించి ఆనాటి సంఘ దురాచారాలను ఎత్తి చూపిన కవి కందుకూరి వీరేశలింగం గారి రాజశేఖర చరిత్రం నవల గురించి సవివరంగా వివరించారు. సాజీ గోపాల్ గారు యుద్ధం గురించి ప్రముఖ కవి వరవరరావు గారి కవితలను సభకు చదివి వినిపించారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం 177వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ముఖ్య అతిథి డా.బీరం సుందరరావు గారు “మానవత్వం పరిమళించే తెలుగు కవిత్వం” అంశం మీద ప్రసంగిస్తూ మానవ సేవయే మాధవ సేవయని చాటి చెప్పిన కవులు, వారు వ్రాసిన కొన్ని ముఖ్యమైన పద్యాలు, కవితలు చదివి వినిపించారు. మనకు తారసపడే ప్రతి వ్యక్తిలోనూ దైవం ఉన్నాడని భావించి వారికి అవసరసమయంలో తోడ్పడి తృప్తితో జీవించగలిగితే అదే స్వర్గమని మనం మన చుట్టూ ఉన్నవారిపై ప్రేమ, దయ చూపించి మానవత్వాన్ని పరమళింప చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన తన ఉపన్యాసంలో ప్రస్ఫుటించారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి గారు ముఖ్య అతిథిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ప్రార్థనా గీతం పాడిన సాహితీ మరియు సింధూతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఎగ్జిక్యూటివ్ కమీటీ సభ్యులు మాధవి లోకిరెడ్డి, జాయింట్ సెక్రటరీ ఉదయ్ నిడిగింటి, వైస్ ప్రెసిడెంట్ సతీష్ బండారు, పాలక మండలి నుండి వెంకట్ ములుకుట్ల, అనంత్ మల్లవరపు, డా. భాస్కర్ రెడ్డి గారు విచ్చేసి సభను జయప్రదం చేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected