ప్రతి నెలా రెండవ శనివారం నిర్వహించే ‘తానా తెలుగు సాంస్కృతిక సిరులు’ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 12వ తేదిన ఉదయం 10 గంటలకు వీణ మరియు గాత్ర సంగీత కచేరి నిర్వహించారు. జూమ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రారంభిస్తూ ప్రతి నెలా క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయమని కల్చరల్ కోఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమ నిర్వాహకురాలు తానా కల్చరల్ కోఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల కార్యక్రమ లక్ష్యాలు వివరిస్తూ కళాకారుల్ని పరిచయం చేసారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శైలజ గుత్తి మొదట తన వీణా వాదనపై పలు కీర్తనలు వినిపించారు. మృదంగ సహకారం బాల అష్టావధాని భరత్ శర్మ అందించారు. అతని మృదంగ వాయిద్యం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అ తర్వాత గాత్ర కచేరిలో శైలజ అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. అదివో అల్లదివో, కొండలలో నెలకొన్నకోనేటి రాయుడు మొదలైన కీర్తనలు ఆలపించిన తీరు పలువుర్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి సభావ్యాఖ్యానం మరియు తాళం అనన్య ఉప్పలధడియం అందించారు.
తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి ప్రసంగిస్తూ సాంస్కృతిక సిరులు ద్వారా ఎంతో మంది కళాకారుల్ని ప్రోత్సాహించడం ఆనందించదగ్గ విషయమని, ఇటువంటి కార్యక్రమాలు శ్రమను మరిపించి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. శిరీష తూనుగుంట్ల వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.