తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ‘తానా’ కి జనవరి 31, ఏప్రిల్ 30 తేదీలు కలిసొచ్చినట్టులేదు. ఇప్పుడున్న పరిస్థితులు, స్థితిగతులను చూస్తుంటే ఈ సెంటిమెంట్ నిజమేనేమో అనిపిస్తుంది. జనవరి 31 2022, ఏప్రిల్ 30 2022, జనవరి 31 2023, మరియు ఏప్రిల్ 30 2023 తారీఖులను ఒక్కసారి నెమరువేసుకుంటే ఔననక తప్పదేమో అనిపిస్తుంది.
వివరాలలోకి వెళితే.. తదనంతర ఎన్నికలలో ఓటు హక్కు వచ్చేలా జనవరి 31 2022 లోపు సుమారు 30 వేల మంది (దాదాపు 17 వేల సభ్యత్వాలు) తెలుగువారు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సభ్యత్వం (Membership) తీసుకున్న సంగతి అన్ని మీడియాల్లో చూశాం.
ఈ తానా సభ్యత్వాలను తానా రాజ్యాంగం (Bylaws) ప్రకారం ఓటు హక్కు వచ్చేలా 3 నెలల అనంతరం ఏప్రిల్ 30 2022 లోపు మెంబర్షిప్ వెరిఫికేషన్ కమిటీ (MVC) ప్రాసెస్ చేయలేదు. దీంతో తానా రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక ఓటు హక్కును కాలరాస్తున్నారంటూ కొత్తగా సభ్యత్వాలు తీసుకున్నవారిలో కొందరు కోర్టు గడప తొక్కారు.
మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ సిటీ సర్క్యూట్ కోర్టు (Baltimore City Circuit Court) లో ఈ కేసు విషయం నలుగుతుండగానే జనవరి 31 2023 న ఎలక్షన్ అనౌన్స్మెంట్ అంటూ బోర్డు తేనె తుట్టెను కదిపి జనవరి 31 సెంటిమెంట్ ని నిజం చేసింది. ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్ చెల్లదు అని కొందరు, చెల్లిద్ది అని మరికొందరు విభిన్న రాగాలు వినిపిస్తుండగానే అన్ని పదవులకి టీం కొడాలి మరియు టీం గోగినేని నుండి పోటాపోటీగా తానా చరిత్రలోనే అత్యంత ఎక్కువగా నామినేషన్స్ వేశారు.
కానీ కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తూ ఇక్కడ కొన్నాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్ అనే బుల్డోజర్ కి బ్రేకులు పడ్డాయి. కాకపోతే ఏప్రిల్ 30 2023 ముంచుకొస్తుంది. తానా రాజ్యాంగం (Bylaws) ప్రకారం ఏప్రిల్ 30 2023 లోపు ఎలక్షన్ ప్రాసెస్ ని పూర్తి చేసి ఉండాలి. పైనున్న బ్రహ్మ దిగి వచ్చినా కూడా ఇది జరగదు, ఎందుకంటే దీనికి ఒక వారం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి. దీంతో ఏప్రిల్ 30 సెంటిమెంట్ కూడా బలపడింది.
వరుసగా 2022 మరియు 2023 సంవత్సరాల్లో జనవరి 31, ఏప్రిల్ 30 తేదీల్లో జరిగిన, అలాగే జరగబోయే తంతు చూస్తే మాత్రం తానా కి జనవరి 31, ఏప్రిల్ 30 తారీఖులు కలిసి రావట్లేదనే సెంటిమెంట్ బలపడుతుంది. కాకపోతే ప్రతి ఎలక్షన్ రీత్యా ఈ రెండు తేదీలు ముఖ్యం కాబట్టి ఇటువంటి సెంటిమెంటు, చింతకాయ పచ్చడి లాంటివేమీ లేవంటూ కొట్టిపారేసేవారు కూడా లేకపోలేదు.
ఇలాంటి సెంటిమెంట్లు ఇంకొన్ని కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు అవి అప్రస్తుతం. చూద్దాం ముందు ముందు ఎన్ని ట్విస్టులు ఉంటాయో, ఇంకెన్ని సెంటిమెంట్లు బలపడతాయో! అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఈరోజు ఆదివారం 23 ఏప్రిల్ 2023 న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి సర్టిఫై చెయ్యడం కూడా అయిపోయి ఉండేది.