తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ నిర్వహించే ప్రతి సేవాకార్యక్రమం దేనికదే సాటి అనేలా సాగుతున్నాయి. తానా ఫౌండేషన్ (TANA Foundation) ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకతను సంతరించుకున్న విషయం అందరికీ విదితమే.
వీటిలో చాలా ప్రత్యేకమైనది ప్రాజెక్ట్ వారధి (Project Vaaradhi). ప్రస్తుత తరానికి, రాబోయే యువ తరానికి ఒక వారధిలా ఈ ప్రాజెక్ట్ వారధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఎప్పుడైనా ప్రాబ్లం మొదళ్ళలో నుంచి మొదలు పెట్టాలి అని తానా ఫౌండేషన్ (TANA Foundation) నాయకత్వం బలీయంగా నమ్ముతుంది.
ముఖ్యంగా పిల్లలు, అందునా తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) చదువుకునే పిల్లలకు సహకారం అందించి, ఒక క్రమబద్ధంగా సానబెడితే అద్భుతాలు సృష్టిస్తారు. ఆ దిశలోనే తానా ఫౌండేషన్ సుమారు 11 సంవత్సరాల క్రితమే అడుగులు వేసింది. పడాల చారిటబుల్ ట్రస్ట్ (Padala Charitable Trust) సహకారంతో ప్రాజెక్ట్ వారధి కి శ్రీకారం చుట్టింది.
స్కూల్ ని అర్ధంతరంగా ముగించడం, ప్రాథమిక అవసరాలు అయినటువంటి బట్టలు, పుస్తకాలు, పౌష్టికాహారం, నిలువు నీడ లేకపోవడం, తల్లితండ్రులు లేకపోవడం లేదా తల్లితండ్రులు నిరక్షరాస్యులవడం, బాలికలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం, తగిన నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వంటి పలు కారణాలను గుర్తించి ప్రాజెక్ట్ వారధి (Project Vaaradhi) ద్వారా అటువంటి వారికి ఒక మార్గాన్ని చూపుతూ వస్తుంది తానా ఫౌండేషన్.
స్థిరత్వం లేని అటువంటి జీవిత చక్రాన్ని బ్రేక్ చేసి, నేటి విద్యార్థులను రేపటి మంచి పౌరులుగా తీర్చిదిద్దేలా ఈ ప్రాజెక్ట్ వారధి ఉపోయోగపడుతుంది. ప్రాధమిక అవసరాలను అందించి, ఆరోగ్యంగా మరియు ఇష్టంగా స్కూల్ కి వెళ్లేలా తోడ్పాటు అందిస్తుంది. అంతే కాకుండా అనాధ పిల్లల్ని, పేద విద్యార్ధులను ఎంపిక చేసుకొని వారికి వివిధ విషయాలపై అవగాహన కల్పించి, భవిష్యత్తులో ఉద్యోగాలు, కోర్సులు వంటి వాటిపై కెరీర్ గైడెన్స్ ఇచ్చి, నైతిక మద్దతు అందిస్తున్నారు.
ఇప్పటి వరకు దాదాపు $350,000 డాలర్లతో ఈ ప్రాజెక్ట్ వారధి ని ముందుండి నడిపిస్తున్నారు. మీరు కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలంటే ఒక్కొక్క విద్యార్థికి $100 డాలర్లు సహాయం చేస్తే సరిపోతుంది. ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli) సారధ్యంలోని TANA Foundation వారు 2024 లోనే సుమారు 300 మంది పేద విద్యార్థులను అడాప్ట్ చేసుకొని ప్రాజెక్ట్ వారధి (Project Vaaradhi) ద్వారా తీర్చిదిద్దారు.
మొత్తంగా గత 11 సంవత్సరాలలో 7 జిల్లాలలోని 20 మండలాలలో 105 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 2,000 మంది విద్యార్ధులకి తానా ప్రాజెక్ట్ వారధి (Project Vaaradhi) ఉపయోగపడడం బహు అభినందనీయం. వీరిలో ఇంజనీరింగ్, డిగ్రీలు చదివి పైకొచ్చినవారి టెస్టిమోనియల్స్ చూస్తుంటే మాటల్లో చెప్పలేని సంతోషం వస్తుంది.
డాడీ లేని లోటు తానా ఫౌండేషన్ (TANA Foundation) వారు తీరుస్తున్నారు అని ఒక విద్యార్థి అందరితో పంచుకుంటున్నదంటే ఇక ఇంతకంటే రుజువు ఏం కావాలి చెప్పండి. కాబట్టి మీరు కూడా తలా ఒక చేయి వేసి మీకు వీలైనంతలో ఒక్కొక్క విద్యార్థికి $100 డాలర్ల చొప్పున సహాయం చేసి వారి భవిష్యత్తుపై చెరగని ముద్ర వేయండి.
ఇందులో భాగంగా గత వారాంతం సెప్టెంబర్ 29 ఆదివారం రోజున తూర్పు గోదావరి జిల్లా, తుని, జగన్నాథగిరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 70 మంది బాలికలకు బట్టలు, పౌష్టికాహారం, విటమిన్లు అందజేశారు. ఈ సందర్భంగా పడాల చారిటబుల్ ట్రస్ట్ నుంచి సూర్య పడాల, తానా (TANA) అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కిరణ్ గోగినేని, దాతలు మరియు ఇతర తానా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.