Connect with us

Language

ఉత్సాహంగా తెలుగు భాషాదినోత్సవం: తెలుగు భాష, సాహిత్య వికాసాలకై మహిళా సంస్థల కృషి – తానా

Published

on

డాలస్, టెక్సాస్: తెలుగు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి ఆగస్ట్ 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “తెలుగు భాష, సాహిత్య వికాసాలకై – మహిళాసంస్థల కృషి” అనే అంశంపై ఒక ప్రత్యేక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట జరుగుతున్న కార్యక్రమ పరంపరలో యిది 38వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం. తానా సంస్థ అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తన ప్రారంభోపన్యాసం లో అందరికి తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్న విశిష్ట అతిథులందరికి స్వాగతం పలికి సభను ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఉగ్గుపాలతో పసిపిల్లలకు మాతృభాష నేర్పే తొలిగురువు తల్లి అని, తెలుగు భాషా పరిరక్షణలో స్త్రీలు ముందుంటే నారీశక్తీ ముందు అందరూ తలవంచ వలసినదేనని, ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో 14 మహిళా సంస్థల ప్రతినిధులు ఒకే వేదికమీద పాల్గొనడం సాహిత్య చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం అని అన్నారు”.   

విశిష్ట అతిథులుగా – డా. కె. ఎన్. మల్లీశ్వరి – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక; వోల్గా – అస్మిత; కొండవీటి సత్యవతి –  స్త్రీవాద పత్రిక భూమిక; అనిశెట్టి రజిత – రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయనవేదిక; రమాదేవి- ఐద్వా; గంటి భానుమతి – లేఖిని, మహిళా సాహిత్య, చైతన్య సాంస్కృతిక సంస్థ; తేళ్ళ అరుణ – నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం); పి. జ్యోతి –  స్ప్రెడింగ్ లైట్; వలబోజు జ్యోతి – జె.వి ప్రచురణలు; అత్తలూరి విజయలక్ష్మి – సరసిజ థియేటర్ ఫర్ ఉమెన్; జ్వలిత – కథయిత్రుల సమూహం; కొండేపూడి నిర్మల – సంతకం సాహిత్యవేదిక మరియు ఆచార్య కాత్యాయనీ విద్మహే – స్త్రీజనాభ్యుదయ అధ్యయనసంస్థ.

విశిష్ఠ అతిథులు గా పాల్గొన్న వివిధ సంస్థల ప్రతినిధులు వారు పనిచేస్తున్న సంస్థ ఆవిర్భావం, చరిత్ర, ఆశయాలు, సాధించిన ప్రగతి, ఈ ఆశయ సాధనలో ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు, సాహిత్యంతో ప్రజా చైతన్యం, సామాజిక సేవ, వర్తమాన కార్యకలాపాలు, భావసారూప్యం ఉన్న ఇతర సంస్థలతో కలసి పనిచెయ్యడం, భవిష్య ప్రణాళిక మొదలైన అంశాలపై ఒక విహంగ వీక్షణంలాగ అత్యంత ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకు వచ్చారు.  తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ తన ముగింపు సందేశంలో తెలుగు భాష నేడు అధ్వాన్న స్థితిలో ఉందని, దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అందరం కలసికట్టుగా పనిచేద్దామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోడ్పడిన వారికి, వివిధ ప్రసార మాధ్యమాలకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected