Connect with us

Education

తానా పాఠశాలకి డల్లాస్ లో భారీ స్పందన, 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభం

Published

on

గత సంవత్సరం పాఠశాలను తానాలో విలీనం చేసుకొని స్వతంత్రంగా తెలుగు తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ద్వితీయ సంవత్సరంలోకి అడుగెట్టిన తానా పాఠశాలకి డల్లాస్ లో భారీ స్పందన వచ్చింది. 200 మందికి పైగా విద్యార్థులతో 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ముఖ్య అతిధిగా పాల్గొని చిన్నారులనుద్దేశించి ప్రసంగించారు. తెలుగు చిన్నారులందరూ వారి అమ్మమ్మలు, నాయనమ్మలు మరియు తాతయ్యలతో మాట్లాడి వారి అనుబంధం, ఆప్యాయతలు పొందే విధంగా వారికి తెలుగు నేర్పించాలనే సంకల్పంతో తానా పాఠశాల ముందుకు వెళుతుంది. దీనితో పాటుగా చదవడం మరియు రాయడం కూడా నేర్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది తెలుగు నేర్చుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీనికి కృషి చేసిన పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల, డల్లాస్ ప్రాంతీయ కార్యదర్శి సతీష్ కొమ్మన, పాఠశాల కో ఆర్డినేటర్ వెంకట శివనాగరాజు తాడిబోయిన, తానా కౌన్సిలర్ ఎట్ లార్జ్ లోకేష్ నాయుడు మరియు ఉపాధ్యాయులను అభినందించారు.

అమెరికాలో ఉన్న తెలుగు చిన్నారులందరికి తెలుగు నేర్పించాలనే లక్ష్యంతో తానా పాఠశాలను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నామన్నారు పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల. అలాగే తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరువ కావడానికి సహకరిస్తున్న తానా మరియు పాఠశాల కార్యావర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో ఉన్నతమైన కార్యంలో తను భాగస్వామిని కావడం ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇంత ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ రావడానికి తానా కార్యవర్గం బాగా సహకరిస్తుందని, వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. తానా మరియు పాఠశాల కో ఆర్డినేటర్లు ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములమైనందుకు సంతోషిస్తున్నామని, దీని అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేశారు.

బోధనా విధానం, ఏ కోర్సులో ఏమి నేర్చుకుంటారు వంటి వివరాలను తానా పాఠశాల అధ్యాపకులు వెంకట్ కొర్రపాటి, అరుణ మరియు వెంకటయ్య లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, 200 మంది చిన్నారులు, తానా మరియు పాఠశాల బృందం పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected