ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జూన్ 18వ తేదీన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తానా మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి (Jayasekhar Talluri) విద్యార్థులకు, తల్లిదండ్రులకు, నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు.
జయశేఖర్ తాళ్లూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు భాషాభివృద్ధికై తానా పాఠశాల ఉపాధ్యాయులు చేస్తున్న నిస్వార్థ సేవను అభినందించారు. ముఖ్యంగా పాఠశాలలో పిల్లలను చేర్పించి తెలుగు బాషను భావి తరాలకు అందించడానికి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతఙ్ఞతలు తెలియచేశారు. అమెరికాలో తెలుగు బాషాభివృద్దే ‘పాఠశాల’ ప్రధాన లక్ష్యం అన్నారు.
పాఠశాలలో ఉత్తీర్ణత పొందిన బాలలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. దాదాపు 100 మంది పాల్గొన్న ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని తానా న్యూయార్క్ ప్రాంతీయ ప్రతినిధి దిలీప్ కుమార్ ముసునూరు, పాఠశాల నిర్వాహకురాలు, ఉపాధ్యాయిని కృష్ణవేణి కొండమడుగుల, హేమలత బొర్రా నిర్వహించారు.
మయూరి బొమ్మిశెట్టి, మాధవి చీదర, లలిత ఎల్లూరు ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. ఈ తానా (TANA) పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమ సందర్భంగా ‘తానా’ సంస్థ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తానా పాఠశాల (TANA Patasala) జాతీయ అధ్యక్షులు, నాగరాజు నలజుల, ఉపాధ్యక్షులు ఫణి కంతేటి, తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, దీపిక సమ్మెట, తానా సంస్థ ట్రస్టీ మెంబరు సుమంత్ రాంశెట్టి, పాఠశాల కోఛెయిర్ హరిశంకర్ పాల్గొని పిల్లలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
TLCA ట్రస్టీ అధ్యక్షులు, తెలుగు భాషా ప్రేమికులు శ్రీ అంకినీడు ప్రసాద్, శ్రీ గుజవర్తి కృష్ణా రెడ్డి, తానా వ్యవస్థాపక సభ్యులు శ్రీ తిపిర్నేని తిరుమల రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలను విజయవంతంగా నిర్వహిస్తున్న తానా సంస్థ నాయకత్వాన్ని అభినందిస్తూ పిల్లలకు తెలుగు భాషను నేర్పించడంలో తానా సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు.
అలాగే తానా (TANA) పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకు ఎంతో కష్టపడి తెలుగు నేర్పిస్తూ తెలుగు బాషను ప్రవాసాంధ్రులకి చేరువ చేయడం తెలుగు వారందరూ గర్వపడే విషయమన్నారు. ముఖ్యంగా పాఠశాల (Patasala) కు అండదండలు అందిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు.
తానా పాఠశాలలో ఉత్తీర్ణత పొందిన బాలలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు వారు అందజేశారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నిర్వహించిన వివిధ పోటీలలో పాల్గొన్న పిల్లలు పలు బహుమతులను గెలుచుకున్నారు. తెలుగు పద్యాలు, శ్లోకాలు చదివి ఆహుతులని ఆశ్చర్యపరిచారు.
వందేమాతర గీతం, జనగణమన గీతం ఆలపించి ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా “ఫాదర్స్ డే” కేక్ కట్ చేసి నాన్నలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించిన నారాయణ రెడ్డి బొందలపాటి, సునీల్ చల్లగుల్ల, రాజేష్ మద్దిపట్ల, సాయి మిన్నెకంటి, తనూజ రసపుత్ర గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.