ఉత్తర అమెరికా తెలుగు సంఘo ’తానా’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “తానా పాఠశాల” న్యూయార్క్ నగర విభాగం ‘పాఠశాల వార్షికోత్సవం’ ఆదివారం మే 26వ తేదీ సంకెన్ మెడో పార్కులో ఘనంగా జరిగింది. దాదాపు 100 మంది పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆహుతులు పాల్గొన్న ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. తానా సంస్థ న్యూయార్క్ RVP దిలీప్ కుమార్ ముసునూరు, పాఠశాల న్యూయార్క్ నగర ప్రధాన నిర్వాహకురాలు, ఉపాధ్యాయులు శ్రీమతి కృష్ణవేణి కొండమడుగుల, హేమలత బొర్రా, లాస్య రెడ్డి మరద మరియు రమ్యప్రభ బొందలపాటి నిర్వహణలో సాగిన ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ‘తానా’ సంస్థ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పిల్లలకు, ఉపాధ్యాయులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. తానా పాఠశాల అధ్యక్షులు నాగరాజు నలజుల, తానా సంస్థ మాజీ అధ్యక్షులు జయ శేఖర్ తాళ్ళూరి పాఠశాల నిర్వాహకులకు ప్రత్యేక అభినందనల సందేశాన్ని పంపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా సంస్థ సీనియర్ నాయకులు, తెలుగు భాషా ప్రేమికులు శ్రీ పోలవరపు రాఘవ రావు గారు, శ్రీ తిపిర్నేని తిరుమల రావు గారు, తానా సంస్థ ట్రస్టీ మెంబరు సుమంత్ రాంశెట్టి, తానా తెలుగు బాషా ప్రచార కమిటీ ఉపాధ్యక్షులు హరిశంకర్ పాల్గొని ప్రసంగించారు.
పిల్లలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల విజయవంతంగా నిర్వహిస్తున్న తానా సంస్థ నాయకత్వాన్ని అభినందిస్తూ పిల్లలకు తెలుగు భాషను నేర్పించడంలో తానా సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు. అలాగే తెలుగుభాషాభివృద్ధికై పాఠశాల ఉపాధ్యాయులు చేస్తున్న నిస్వార్థ సేవను అభినందించారు. ముఖ్యంగా పాఠశాలలో పిల్లలను చేర్పించి తెలుగు బాషను భావి తరాలకు అందించడానికి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతఙ్ఞతలు తెలియచేసారు. పాఠశాలలో ఉత్తీర్ణత పొందిన బాలలకు బహుమతులు , ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నిర్వహించిన వివిధ పోటీలలో పాల్గొన్న పిల్లలు పలు బహుమతులను గెలుచుకున్నారు. అలాగే తెలుగు పద్యాలు, శ్లోకాలు చదివి ఆహుతులని అలరించారు. వందేమాతర గీతం, జనగణమన గీతం ఆలపించి ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా తానా పాఠశాల ఆహ్వానాన్ని అందుకుని విచ్చేసిన టి.ఎల్.సి.ఏ అధ్యక్షులు జయప్రకాష్ ఇంజపూరి, ఉపాధ్యక్షులు నెహ్రు కటారు ప్రసంగించి పాఠశాల ఉపాధ్యాయులను, పిల్లలను అభినందించి బహుమతులు, ప్రసంశాపత్రాలు అందచేశారు.
చివరగా న్యూయార్క్ RVP దిలీప్ కుమార్ ముసునూరు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరిoచిన తానా నాయకత్వానికి కృతఙ్ఞతలు తెలియజేస్తూ పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేసారు. అలాగే కార్యక్రమ విజయవంతానికి సహకరించిన నారాయణ రెడ్డి బొందలపాటి , సునీల్ చల్లగుల్ల, కలీం, రజిత కల్లూరి, అట్లూరి లావణ్య, వల్లూరి గిరి, రాజేష్ మద్దిపట్ల, సాయి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.