తానా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ మొదటిసారిగా జాతీయ స్థాయిలో తానా క్రికెట్ ఛాంపియన్షిప్ 2022 కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సిటీ స్థాయిలో, రీజియన్ స్థాయిలో, చివరిగా జాతీయ స్థాయిలో నాకౌట్ ఫార్మాట్లో నిర్వహించే ఈ పోటీలకు జాతీయ టైటిల్ స్పాన్సర్ గా ఏజి ఫిన్ టాక్స్ అధినేత అనిల్ గ్రంధి వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే అపలాచియన్, డల్లాస్ ఫోర్ట్ వర్త్ మరియు ఒహాయో రీజియన్ స్థాయి పోటీలు విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. అదే ఊపులో జూన్ 4, 11, 18 వారాంతాలలో అవిశ్రాంతంగా నిర్వహించిన న్యూ ఇంగ్లండ్ రీజియన్ స్థాయి క్రికెట్ పోటీలు హోరాహోరీగా ముగిశాయి.
న్యూ ఇంగ్లండ్ రీజినల్ కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ గడ్డం ఆధ్వర్యంలో 16 జట్ల కూర్పుతో సాగిన ఈ టోర్నమెంట్ ఫైనల్స్ లో ఎస్డబ్ల్యూసీసీ మరియు ఛాలెంజర్స్ జట్లు పోటీపడగా చివరకు ఎస్డబ్ల్యూసీసీ జట్టు విజయం సాధించింది. దీంతో ఛాలెంజర్స్ జట్టు రన్నరప్ గా నిలిచింది.
ఈ టోర్నమెంట్ నిర్వహణకు సహాయపడిన వారిలో మహేష్ బొల్లిముంత, జగదీశ్ దిరిశల, హర్షద్ రెడ్డి, రాజ్ యార్లగడ్డ, అనిల్ కెంచ, తిరు మరియు మహేష్ రాథోర్, తరణి పరుచూరి, పవన్ తదితరులు ఉన్నారు. అలాగే తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ ప్రత్యేకంగా మిసిసిప్పి నుంచి వచ్చి తోడ్పాటు అందించడం అభినందనీయం.
అదనంగా జూన్ 18 వారాంతం వాలీబాల్ మరియు త్రోబాల్ టోర్నమెంట్స్ నిర్వహించారు. వాలీబాల్ గోల్డ్ కేటగిరీలో కొంబన్ జట్టు విజేతగా, చారియర్స్ జట్టు రన్నర్ గా, వాలీబాల్ సిల్వర్ కేటగిరీలో బాలయ్య వారియర్స్ జట్టు విజేతగా, బ్లాక్ బస్టర్స్ జట్టు రన్నర్ గా అలాగే త్రోబాల్ టోర్నమెంట్లో రైజర్స్ జట్టు విజేతగా, బ్లూ వేల్స్ జట్టు రన్నర్ గా నిలిచాయి.
మొత్తంగా 3 వారాంతాలు, సుమారు 50 జట్లు, 350 మందికి పైగా క్రీడాకారులతో న్యూ ఇంగ్లండ్ రీజియన్ లెవెల్ టోర్నమెంట్లు మంచి ఊపుని తెచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విజేతలకు క్యాష్ ప్రైజెస్ మరియు ట్రోఫీలు బహుకరించారు.
ఈ క్రీడా కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా సెనెటర్ సాద్ అన్వర్, సౌత్ విండ్సర్ ప్రస్తుత మరియు గత మేయర్స్ లిజ్ పెండల్టన్, ఆండ్రూ పాటెర్న మరియు డా. ఉమ మధుసూధన్ హాజరవడం విశేషం.