Connect with us

Cricket

అపలాచియన్ రీజియన్ షార్లెట్ లో తానా జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ గ్రాండ్ కిక్ ఆఫ్

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో తానా క్రికెట్ ఛాంపియన్షిప్ కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సిటీ స్థాయిలో, రీజియన్ స్థాయిలో, చివరిగా జాతీయ స్థాయిలో నాకౌట్ ఫార్మాట్లో పోటీపడేలా గత మార్చి నెలలో ప్రణాళిక రచించిన విషయం విదితమే.

షార్లెట్ లోని రాబర్ట్ స్మిత్ పార్క్ క్రికెట్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అపలాచియన్ రీజియన్ టోర్నమెంట్ కిక్ ఆఫ్ తో తానా జాతీయ స్థాయి క్రికెట్ ఛాంపియన్షిప్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దీనికి కర్త, కర్మ, క్రియ తానా అపలాచియన్ రీజియన్ ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి అనే చెప్పాలి. ఎందుకంటే సుమారు నెలన్నరపాటు ప్లానింగ్, స్పాన్సర్షిప్స్ సేకరణ, లాజిస్టిక్స్ మొదలగు విషయాలలో పకడ్బందీగా ఉండి ఏప్రిల్ 23, 24, 30 తారీఖుల్లో అనుకున్నది అనుకున్నట్టుగా టోర్నమెంట్ ని విజయవంతంగా పూర్తిచేశారు.

12 జట్లు, 163 మంది ఆటగాళ్లు, 3654 రన్స్, 1 సెంచరీ, 158 వికెట్స్, 2233 బాల్స్, 31 నోబాల్స్, 197 వైడ్లు, 364 ఫోర్లు, 208 సిక్సులు, 14 అర్ధ సెంచరీలు, 112 క్యాచ్లు, 8 రనౌట్లు, 19 డకౌట్లు తో కూడిన ఈ అపలాచియన్ రీజియన్ టోర్నమెంట్ తానా జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ కి గ్రాండ్ కిక్ ఆఫ్ తోపాటు క్రికెట్ ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జట్ల కూర్పు, స్కోర్ బోర్డు తదితర వివరాలకు క్రిక్ క్లబ్స్ యాప్ ని సందర్శించండి.

ఒక రకంగా చెప్పాలంటే మొత్తం జాతీయ స్థాయి తానా క్రికెట్ ఛాంపియన్షిప్ కి ఇది కర్టెన్ రైజర్ ఈవెంట్ లాంటిది. ఎందుకంటే తదుపరి నిర్వహించాల్సిన మిగతా ప్రాంతీయ టోర్నమెంట్స్ కి ఉదాహరణలా ఉపయోగపడుతుంది కాబట్టి. అందుకనే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు తానా లీడర్షిప్ లో ఉన్న అతిరధమహారధులు అందరూ షార్లెట్ వైపు స్టీరింగ్ తిప్పారు.

ఇటు అట్లాంటా నుంచి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, అటు మిసిసిప్పి నుంచి ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ మరియు క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ, ఒహాయో నుంచి రవి సామినేని, శ్రీని యలవర్తి, శివ చావా, అలాగే స్థానిక అపలాచియన్ రీజియన్ నాయకత్వం శ్రీనివాస్ చందు గొర్రెపాటి, పురుషోత్తమ చౌదరి గుదె, ఠాగూర్ మల్లినేని, రాజేష్ యార్లగడ్డ, వేణు చావా, వినోద్ కాట్రగుంట తదితరులు తరలివెళ్లారు.

ఈ రీజినల్ టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు తలపడ్డాయి. లీగ్ గేమ్స్ అన్నీ ఏప్రిల్ 23, 24 న ముగించారు. ఏప్రిల్ 30 న మొదటి సెమీఫైనల్స్ మ్యాచ్ లో ఫీనిక్స్ సీసీ మరియు జాతిరత్నాలు జట్లు పోటీపడగా ఫీనిక్స్ సీసీ జట్టు 38 పరుగుల తేడాతో గెలుపొందింది. అలాగే రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్ లో బిందాజ్ బాయ్స్ మరియు డాషింగ్ డైనమిట్స్ జట్లు పోటీపడగా బిందాజ్ బాయ్స్ జట్టు 75 పరుగుల తేడాతో గెలుపొందింది.

సెమీఫైనల్స్ లో గెలుపొందిన ఫీనిక్స్ సీసీ మరియు బిందాజ్ బాయ్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగి, చివరికి బిందాజ్ బాయ్స్ జట్టుని విజయం వరించింది. 8 వికెట్లతో బిందాజ్ బాయ్స్ జట్టు అపలాచియన్ రీజియన్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. రాబోవు రోజుల్లో మిగతా రీజియన్స్ లో విజేతలైన జట్లతో ఈ అపలాచియన్ రీజియన్ బిందాజ్ బాయ్స్ జట్టు జాతీయ స్థాయిలో నాకౌట్ ఫార్మాట్లో పోటీపడుతోంది.

ట్రోఫీ డిస్ట్రిబ్యూషన్ సెరిమోనీ కార్యక్రమంలో భాగంగా అన్నిటి కంటే ముందు తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ అపలాచియన్ రీజియన్ టోర్నమెంట్ జరిగిన మూడు రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే అంతకుముందు ప్లానింగ్ మరియు లాజిస్టిక్స్ లో బ్లడ్ పెట్టి మరీ పని చేసిన ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి, ఈవెంట్ కోఆర్డినేటర్స్ వెంకీ అడుసుమిల్లి, అశ్విన్ యడ్లపల్లి, శ్రీధర్ పెళ్లూరు, లక్ష్మీపతి జూలపల్లి, అలాగే వాలంటీర్స్ సుధీర్ బొల్లం, శ్రీనాధ్ గింజుపల్లి, సాయి కిలారు, ప్రణయ్ రెడ్డి మైనంపాటి, రవి బొజ్జ, యశ్వంత్ బాగం, సతీష్ నాగభైరవ, బాల నల్లపనేని తదితరులందరినీ పేరు పేరునా ప్రత్యేకంగా అభినందించడం అందరినీ ఆకట్టుకుంది.

అనంతరం తానా నాయకత్వం అంతా కలిసి ట్రోఫీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫీనిక్స్ సీసీ రన్నర్స్ జట్టుకి $750 క్యాష్ ప్రైజ్ మరియు ట్రోఫీ, విజేతలైన బిందాజ్ బాయ్స్ జట్టుకి $1500 క్యాష్ ప్రైజ్ మరియు ట్రోఫీ అందించారు. ఈ సందర్భంగా బిందాజ్ బాయ్స్ జట్టు $500 తిరిగి తానా ఫౌండేషన్ కి డొనేట్ చేయడం అభినందనీయం. అన్ని మ్యాచ్ లకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అలాగే టోర్నమెంట్ మొత్తంమీద బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్ మ్యాన్, మోస్ట్ వాల్యూడ్ ప్లేయర్ వంటి ట్రోఫీస్ కూడా అందించారు.

ఈ జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ కి ఆద్యులు తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ ప్రత్యేకంగా షార్లెట్ వచ్చి ఈ టోర్నమెంట్లో అందరితో కలివిడిగా, చనువుగా ఉంటూ చివరి వరకు ప్రోత్సాహం అందించడం మెచ్చుకోవలసిందే. వారాంతాలవడం మరియు వాతావరణం కూడా అనుకూలించడంతో ప్రేక్షకులు కుటుంబసమేతంగా హాజరయ్యారు.

ఉదయం నుంచి రాత్రి వరకు అందరికీ ప్రత్యేకంగా హోమ్ మేడ్ భోజన సదుపాయాలు సమకూర్చడంతో టోర్నమెంట్ ఆసాంతం క్రీడా స్ఫూర్తిని ప్రత్యక్షంగా వీక్షించారు. దీంతో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అపలాచియన్ రీజియన్ టోర్నమెంట్ ని ఘనంగా ముగించడమే కాకుండా మున్ముందు జరగబోయే రీజినల్ టౌర్నమెంట్స్ కి బార్ హై లో సెట్ చేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected