ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాకపోతే ఈసారి యువతకి, క్రీడలకి సంబంధించి. తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ గత కొన్ని నెలల్లో బాస్కెట్ బాల్ మరియు వికలాంగుల ఆటలపోటీలను విజయవంతంగా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తానా చరిత్రలో మొట్టమొదటిసారిగా మరో సరికొత్త క్రీడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శశాంక్.
అదేంటంటే ‘తానా క్రికెట్ ఛాంపియన్షిప్’. గత కొన్ని వారాలుగా ఈ కొత్త ఆలోచనకి పదును పెడుతూ పలుమార్లు తానా జాతీయ మరియు ప్రాంతీయ అడ్హాక్ కమిటీలలోని క్రీడల ఛైర్స్ మరియు కోఛైర్స్ తో సమావేశమయ్యారు. వీరికి అదనంగా రీజినల్ కోఆర్డినేటర్స్ ని కూడా కలిపి గత వారాంతం ఫిబ్రవరి 27న మరోసారి సమావేశమయ్యారు. ఫైనల్ గా తానా క్రికెట్ ఛాంపియన్షిప్ కి అదేరోజు రోడ్ మ్యాప్ సిద్ధం చేసారు.
ఈ సమావేశంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కార్యదర్శి సతీష్ వేమూరి తోపాటు వివిధ జాతీయ మరియు ప్రాంతీయ సమన్వయకర్తలు 25 మంది పాల్గొన్నారు. శశాంక్ అందరినీ స్వాగతించగా, అంజయ్య చౌదరి మరియు సతీష్ తమ మద్దతు తెలిపి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. అనంతరం శశాంక్ టోర్నమెంట్ రోడ్ మ్యాప్ ని వివరించారు. మధ్య మధ్యలో కొందరు సమన్వయకర్తలు గ్రౌండ్స్, షెడ్యూల్, జట్ల కూర్పు, లాజిస్టిక్స్ తదితర విషయాలపై ప్రశ్నలు సమాధానాలతో కూలంకుషంగా చర్చించారు.
అమెరికా మొత్తాన్ని కొన్ని రీజియన్స్ గా విభజించి ముందు సిటీ స్థాయిలో లోకల్ గ్రూప్ ఫార్మాట్ టోర్నమెంట్స్ ఆడి గెలిచిన వారు రీజియన్ స్థాయిలో నాకౌట్ ఫార్మాట్లో పోటీపడేలా, అలాగే రీజియన్ స్థాయిలో ఆడి గెలిచిన వారు జాతీయ స్థాయిలో నాకౌట్ ఫార్మాట్లో పోటీపడేలా, చివరిగా జాతీయ స్థాయిలో గెలిచిన జట్టుకి తానా క్రికెట్ ఛాంపియన్షిప్ కప్ అందించేలా ఈ క్రికెట్ టోర్నమెంట్ కి ప్రణాళిక రచించారు. ఈ మొత్తం ప్రక్రియలో సహాయపడిన మరియు కీలక పాత్ర పోషించనున్న క్రీడా కమిటీ సభ్యులు, ఛైర్స్, కోఛైర్స్, రీజినల్ కోఆర్డినేటర్స్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ ప్రణాళికను నిన్న జరిగిన తానా కార్యవర్గ సమావేశంలోనూ వివరించారు.
ఏప్రిల్ నెలలో సిటీ స్థాయి పోటీలతో మొదలుపెట్టి జూన్ నెల లాంగ్ వీకెండ్లో జాతీయ స్థాయి పోటీలతో టౌర్నమెంట్ ముగించేలా సన్నాహాలు ప్రారంభించారు. తానా చరిత్రలో ఒక మైలు రాయిలా, కొత్త ఒరవడి సృష్టించేలా, ఫైనల్స్ పోటీలను లైవ్ ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్లు శశాంక్ తెలిపారు. ముందు ముందు రాబోయే క్రీడా కార్యదర్శిలకు ఆదర్శప్రాయంగా కొత్త కొత్త సిగ్నేచర్ టోర్నమెంట్స్ కి రూపకల్పన చేస్తున్న శశాంక్ ని యూ ఆర్ సెటింగ్ ది బార్ హై అంటూ తానా సభ్యులు అభినందిస్తున్నారు.