. జనవరి 31, 2022 లోపు సుమారు 33 వేల తానా కొత్త సభ్యత్వాలు
. గడువు లోపు ప్రాసెస్ చేయని మెంబర్షిప్ వెరిఫికేషన్ కమిటీ
. ఓటు హక్కుని కాలరాస్తున్నారంటూ కోర్టు తలుపు తట్టిన సభ్యులు
. కోర్టు నోటీసులు అందుకున్న తానా బోర్డు సభ్యుల సమావేశం
. ఏమవుతుందోనని సగటు తెలుగువారి ఆత్రుత
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ సంస్థలో గత జనవరి 31, 2022 లోపు సుమారు 33 వేల మంది తెలుగువారు సభ్యత్వం తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తానా రాజ్యాంగం లోని ఆర్టికల్ XIV ప్రకారం మెంబర్షిప్ వెరిఫికేషన్ కమిటీ వీరందరి కొత్త సభ్యత్వాలు ఏప్రిల్ 30, 2022 కల్లా పరిశీలించి కరెక్ట్ గా ఉన్నవాటిని ఆమోదించవలసి ఉంది.
కానీ తానా మెంబర్షిప్ వెరిఫికేషన్ కమిటీ నిర్ణీత గడువు లోపు ఈ పని పూర్తిచేయకపోవడం వల్ల ఈ 33 వేల కొత్త తానా సభ్యులు వచ్చే 2023 తానా ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోతారట. దీంతో తమ దగ్గిర నుంచి సభ్యత్వ రుసుము తీసుకొని, అన్ని విషయాలు కరెక్ట్ గా ఉన్నప్పటికీ తాము చేయని తప్పుకి బలిపశువులను చేస్తూ తానా రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కు అయినటువంటి ఓటు హక్కును కాలరాస్తున్నారంటూ కొంతమంది కోర్టు తలుపు తట్టారు.
తానా ఫైనల్ ఓటర్స్ లిస్ట్ ఖరారు చేసే తరుణం ఆసన్నమవడంతో, ఆ ప్రక్రియను ఆపాలని టెంపొరరి రిస్ట్రైనింగ్ ఆర్డర్ కోరుతూ మేరీల్యాండ్ కోర్టులో కొత్త సభ్యులు కేసు పెట్టారట. ఈ కేసుకి సంబంధించి తానా బోర్డుకి కూడా నోటీసులు అందినట్లు వినికిడి. దీంతో తానా బోర్డు సమావేశం కాబోతున్నట్లు తెలిసింది.
ఈ కీలక బోర్డు సమావేశంలో ఏమి నిర్ణయిస్తారో అంటూ సర్వత్రా ఆత్రుత నెలకొంది. కోర్ట్ తీర్పు వచ్చే వరకు ఆగుతారో లేక ఓటర్ జాబితా ని ఫైనల్ చేసి ముందుకు సాగుతారో వేచిచూడాల్సిందే. కాకపోతే కోర్టులు గట్రా వంటివి లేకుండా చెల్లుబాటు సభ్యత్వాలందరికీ ఓటు హక్కు కల్పించి తానా సంస్థ గౌరవాన్ని కాపాడాలని కోరుతున్నారు సగటు తెలుగువారు.
కోర్టు కేసు వివరాలకు MarylandBaltimoreTANAMVCCourtCase ని సందర్శించండి. కోర్టు కేసు కాపీ కొరకు www.NRI2NRI.com/TANAMVCCourtCaseCopy ని సందర్శించండి. అలాగే తానా రాజ్యాంగం కొరకు TANA website ని సందర్శించండి.