ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మిడ్-అట్లాంటిక్ ఆధ్వర్యంలో అక్టోబర్ 26వ తేదీన పెన్సిల్వేనియా (Pennsylvania) లోని హనీ బ్రూక్ (Honey Brook), చెస్ట్‌నట్ రిడ్జ్‌లో యూత్ ఫుడ్ డ్రైవ్ (Food Drive) 2025 కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. రెండు రోజుల్లోనే, చెస్ట్‌నట్ రిడ్జ్ కమ్యూనిటీ అద్భుతమైన స్పందనతో, అవసరమైన కుటుంబాలకోసం పెద్ద మొత్తంలో ఆహారాన్ని సేకరించింది.
ఈ తానా యూత్ ఫుడ్ డ్రైవ్ (Food Drive) డిసెంబర్ 6 వరకు కొనసాగుతుంది. సేకరించిన విరాళాలన్నీ చెస్టర్ కౌంటీ (Chester County Food Bank) ఫుడ్ బ్యాంక్‌కు అందిస్తామని తానా నాయకులు చెప్పారు. స్థానికంగా ఉన్న పేదలను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని తానా నాయకులు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి (Dr. Naren Kodali), తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ రీజినల్ ప్రతినిధి ఫణి కంతేటి (Phani Kantheti), తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, ఫుడ్ డ్రైవ్ కోఆర్డినేటర్ గోపి వాగ్వాల, మరియు యూత్ ఫుడ్ డ్రైవ్ చైర్మన్ లు వ్యోమ్ క్రోతపల్లి, సోహన్ సింగు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తానా యూత్ ఫుడ్ డ్రైవ్ (Food Drive) లో ఉత్సాహంగా పాల్గొన్న యువ వాలంటీర్ల అంకితభావం, నాయకత్వాన్ని గుర్తించి, వారికి ప్రశంసా పత్రాలను తానా (Telugu Association of North America – TANA) నాయకులు అందజేశారు.
ఈ కిక్‌ఆఫ్‌ను విజయవంతం చేసిన తల్లిదండ్రులకు, యువ వాలంటీర్లకు, మరియు చెస్ట్ నట్ రిడ్జ్ (Chestnut Ridge) హోమ్ ఓనర్స్ అసోసియేషన్ కు వారి కృషి, సామాజిక స్ఫూర్తికి హృదయపూర్వక ధన్యవాదాలను, ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడానికి కృషి చేసిన రాధా కృష్ణ ముల్పూరికి కూడా తానా (TANA) నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
మిడ్-అట్లాంటిక్ యువ వాలంటీర్లు 5,000 పౌండ్ల ఆహారాన్ని సేకరించి, స్థానిక ఫుడ్ బ్యాంక్‌లకు విరాళంగా ఇవ్వాలని పెద్ద, ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పని చేయడం పట్ల తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri) హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఆరు వారాల పాటు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన కోరారు.