ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ న్యూ జెర్సీ ప్రాంతీయ ప్రతినిధి, కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వంశీ వాసిరెడ్డి ఆధ్వర్యంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, కార్యనిర్వహక ఉపాధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, సహకారంతో గుంటూరు జిల్లా పెదకాకాని లోని శంకర్ కంటి వైద్యశాల సంయుక్తంగా శ్రీ గౌతం హైస్కూల్లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది.
ఈ శిబిరంలో 427 మందికి వైద్య పరీక్షలు నిర్వహించటం జరిగినది. వీరిలో 198 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. వీరికి శంకర్ కంటి వైద్య శాలలో ఉచితంగా ఆపరేషన్ చేయబడునని వైద్యులు తెలిపారు. ఈ మెగా ఐ క్యాంపు కార్యక్రమాన్ని తానా న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి వంశీ వాసిరెడ్ది స్పాన్సర్ చేయగా, తానా ఫౌండేషన్ ట్రస్టీ సుమంత్ రామిసెట్టి సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ శిబిరాన్ని నందిగామ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, నగర పంచాయతీ కమిషనర్ జయరాం, మాజీ ఎమ్మెల్యే సౌమ్య తంగిరాల ప్రారంభించారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్వర్ణలత శాఖమూరు ఈ మెగా క్యాంప్ ను సమన్వయం చేసారు. కంటి వైద్య శిబిరానికి తరలివచ్చిన ప్రజలకు శంకర్ నేత్రాలయ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు.