Connect with us

Literary

స్ఫూర్తిదాయకంగా ప్రతిభామూర్తుల జీవిత చరిత్ర సదస్సు @ తానా ప్రపంచ సాహిత్య వేదిక

Published

on

డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న సాహిత్య సమావేశాల పరంపరలో జూన్ 30న జరిగిన 68వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అతిథులను సాదరంగా ఆహ్వానించి సదస్సును ప్రారంభిస్తూ “ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు చదవడంద్వారా కేవలం వారు గడిపిన జీవితమేగాక ఆనాటి సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులు, ప్రజల జీవనవిధానం మొదలైన ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంతేగాక ఆయా ప్రముఖులు తమ జీవితాలలో ఎదుర్కొన్న సమస్యలు, ఆటుపోట్లు, వాటిని అధిగమించిన తీరునుండి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చునని అందువల్ల తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘జీవితచరిత్రలు’ లేదా ‘ఆత్మకథలు’ చాలా ముఖ్యభూమిక వహిస్తాయన్నారు.”

కృష్ణా జిల్లాలోని ‘ముదునూరు’ అనే గ్రామంలో “జీవితచరిత్రల గ్రంధాలయం” వ్యవస్థాపకులు డా. నాగులపల్లి భాస్కరరావు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొని ఈ గ్రంధాలయ స్థాపన వెనుకఉన్న ఆశయాన్ని, అమలు జరుగుతున్న తీరుతెన్నులను సోదాహరణంగా వివరించారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్నవారిలో సుప్రసిద్ధ రచయిత్రి, విద్యావేత్త ఆచార్య డా. సి. మృణాళిని ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి రచించిన “మా జ్ఞాపకాలు” అనే జీవిత చరిత్రను మరియు బీనాదేవి పేరుతో భార్యాభర్తలు కలిసి జంటగా రాసిన అనేక రచనలను “బీనాదేవీయం” అనే గ్రంథాలలోని అనేక విషయాలను చాల హృద్యంగా ఆవిష్కరించారు.

ప్రముఖ రచయిత డా. జి. వి. పూర్ణచందు తెలుగువారికి తక్కువగా పరిచయమైన తమిళనాట ఆధ్యాత్మికరంగంలో ఎనలేని కృషిచేసిన తెలుగు ప్రముఖులు “అప్పయ్య దీక్షితులు” మరియు “అల్లూరి వేంకటాద్రిస్వామి” జీవిత చరిత్రలలోని అనేక విశేషాలను పంచుకున్నారు. ప్రముఖ సాహితీవేత్త, ప్రయోక్త కిరణ్ ప్రభ ఒక రష్యన్ యువతి కేవలం భారతీయ నృత్య కళలపై ఆసక్తితో తన పేరును “రాగిణీదేవి” గా మార్చుకుని ఎన్నో సాహసాలతో భారతదేశంలో అడుగుపెట్టి, అనేక సంవత్సరాలు కృషిచేసి నాట్యం నేర్చుకున్నదీ, నాట్యశాస్త్రంపై ఎంతో పరిణితితో కూడిన గ్రంథాలు రాసిందీ, తన కుటుంబం మొత్తం ఏ విధంగా నాట్యకళకు జీవితాంతం అంకితం అయిందీ లాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను చాలా ప్రతిభావంతంగా ఆవిష్కరించారు.

అలాగే తాను నమ్మిన సిద్దాంతంకోసం తన తుదిశ్వాస వరకు ఏవిధంగా గిడుగు ఒంటరి పోరాటం చేసినదీ, వ్యావహారిక భాషోద్యమ పితామహుడు “గిడిగు వేంకట రామమూర్తి” గారి జీవితంలోని అనేక కోణాలను కిరణ్ ప్రభ విశ్లేషించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇలాంటి సాహితీ సమావేశాలు విద్యార్థులకోసం ప్రత్యేకంగా నిర్వహించడం చాలా అవసరం అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected