ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ కల్చరల్ విభాగం ఇటీవల డిసెంబర్ 4, 5 తేదీల్లో నిర్వహించిన కూచిపూడి సెమినార్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా తానా ఆర్ట్స్, క్లాసికల్ నేషనల్ చైర్ పద్మజ బేవర మాటల్లో “మేము ఊహించిన దానికన్నా ఎక్కువమంది యువతరం ఈ సెమినార్లో పాల్గొన్నారు. యువతరానికి కూచిపూడి పట్ల ఉన్న అవగాహనను, అంకిత భావాన్ని చూసి గురువులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమానికి చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, కానీ అందరికి సెమినార్ లో అవకాశం కల్పించడం కుదరలేదు. మాకు వచ్చిన ఆర్టికల్స్ ని కూచిపూడి గురువులు సమీక్ష చేసి ఫైనలిస్టులను సెమినార్ కి పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేస్తున్నా” అన్నారు.
ఈ కూచిపూడి సెమినార్ ముఖ్యాంశాలలోకి వెళితే తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు స్ఫూర్తి దాయక ప్రసంగంతో సెమినార్ ప్రారంభమైంది. తానా కల్చరల్ కోఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల మొదటి సెషన్ ప్రారంభించి సెమినార్ ముఖ్య ఉద్దేశ్యం వివరించారు. ఈ కార్యక్రమ రూపకర్త డాక్టర్ దీర్ఘాసి విజయ భాస్కర్ కూచిపూడి విశిష్టత తెలియ జేశారు. శ్రావణి వేదగిరి ప్రదర్శించిన గణేష్ ప్రార్థన గీతం అందరినీ ఆకట్టుకుంది. మొదటి సెషన్ కూచిపూడి గురువు శ్రీమతి స్వాతి అట్లూరి అధ్యక్షుతన జరిగింది. ఈ సెషన్ కీ నోట్ స్పీకర్ డాక్టర్ యశోదా ఠాకూర్ ప్రసంగిస్తూ కూచిపూడి లోని అనేక మౌలిక అంశాలు ప్రస్థావించారు. అతిథి వక్తలు కూచిపూడి గురువులు పద్మిని నిడుమోలు, శ్రీవాణి వొక్కరనే, శ్రీదేవి దడితోట అందరి సందేహాలకూ చక్కని జవాబు లిచ్చారు. సెమినార్ లో పాల్గొన్న సోనిక, వైష్ణవి , సిరి చందన, మంజుశ్రీ, హారిక, చిన్మయి, పావని మరియు కుసుమ్ రావ్ వారి పేపర్స్ ప్రెజెంట్ చేసి గురువుల అభిప్రాయాల్ని, సూచనల్ని పొందారు. ఈ సెషన్ మోడరేటర్లు లక్ష్మి బాబు మరియు అనసూయ మాల్యవంతం చక్కని సమయోచిత వ్యాఖ్యలు చేశారు.
శిరీష తూనుగుంట్ల మొదటి సెషన్ జరిగిన తీరుని క్లుప్తంగా విశ్లేషిస్తూ రెండవ సెషన్ ప్రారంభించారు. ఎస్ పి భారతి ఈ సెషన్ లో కీలకోపన్యాసం చేస్తు నాట్య శాస్త్రం ప్రాధాన్యత వివరించారు. అతిథి వక్తలు, కూచిపూడి గురువులు శ్రీలత సూరి, రాధిక కౌతా రావు, అరుణ చంద్ర వారి ఉపన్యాసాలతో అలరించారు. రెండవ సెషన్లో లిఖిత, గాయత్రి, సత్య శివాని, సాధన, వైష్ణవి, సహసర, వోషిత మరియు వనసర్ల పాల్గొని వారి పేపర్స్ ని ప్రజంట్ చేసి యువతకు కూచిపూడి పట్ల ఉన్న దృక్పదాన్ని తెలియ జేశారు. పాల్గొన్నవారందరికీ త్వరలో తానా ప్రశంసా పత్రాలను పంపుతుంది. చివరిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పద్మజ బేవర అభినందనలు తెలియజేశారు.