Connect with us

Devotional

తానా ‘కావ్య దీపావళి’: ఆకట్టుకున్న గరికపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ప్రసంగం

Published

on

దీపావళి పండుగ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో నవంబర్ 5వ తేదీ శుక్రవారం అంతర్జాలంలో నిర్వహించిన ప్రత్యేక “కావ్య దీపావళి” వేడుకలు ఘనంగా జరిగాయి. ఒక్కొక్క దీపం వెలిగిస్తూ చీకటిని పారద్రోలినట్లు, ఒక్కొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకోవాలంటూ దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరిoచుకుని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రఖ్యాత సహస్రావధాని, ప్రవచన కిరీటి, డాక్టర్ గరికపాటి నరసింహారావు సందేశం అందించారు.

ఇంకా దీపావళి పండుగ ప్రాముఖ్యంపై గరికపాటి నరసింహారావు ప్రసంగిస్తూ మన ప్రాచీన కావ్యాలలో, సంప్రదాయంలో గురువుకి, తల్లికి, స్రీలకు ప్రత్యేక గౌరవం ఉందనీ వారికి తగిన ప్రాదాన్యతనిచ్చి గౌరవించడం నేర్చుకోవాలని ఈ దీపావళి పండుగ వెలుగులు సత్యభామ శ్రీ కృష్ణులు కలసి లోకానికి అందించిన కానుకగా అభివర్ణించారు. ప్రతి వ్యక్తీ, తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి తనలోని అంతర్జ్యోతిని వెలిగించుకోవాలని తద్వారా తనతోపాటు తన తోటి మానవులకోసం, తన చుట్టూ ఉన్న సమాజహితం కోసం పాటుపడాలని హితోపదేశం చేసారు. అదే శ్రీ కృష్ణ పరమాత్మ దీపావళి సందేశమని తెలిపారు.

ప్రత్యేక అతిథిగా పాల్గొన్న తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రారంభోత్సవం చేస్తూ ఆహుతులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియచేసి తానా చేపడుతున్న విస్తృత సేవా కార్యక్రమాలను సభికులకు సోదాహరణoగా వివరిoచారు. భవిష్యత్తులో తెలుగువారు గర్వపడేలా ‘తానా’ మరిన్ని మంచి కార్యక్రమాలు అందిస్తుందని తెలియజేసారు. ఈ దీపావళి కార్యక్రమానికి రూపకల్పన చేసిన తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, కమ్యునిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి లను ప్రత్యేకంగా అభినందించారు. గరికపాటి నరసింహారావుని శిరీష తూనుగుంట్ల ఆహుతులకు పరిచయం చేసి దీపావళి కార్యక్రమాన్ని ప్రారంభించగా, కమ్యునిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

తానా పూర్వ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర, జాయింట్ ట్రెజరర్ భరత్ మద్దినేని, వెబ్ కమిటీ ఛైర్మన్ బిల్హన్ ఆలపాటి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. కార్యక్రమ ప్రారంభంలో కుమారి శృతి సమన్వి కాకర్లపూడి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి ఆహుతులను ఆహ్లాద పరిచారు. దీపావళి పండుగ కార్యక్రమాన్ని ఘనంగా అంతర్జాలంలో నిర్వహించిన ‘తానా’ సంస్థకు, కార్యక్రమ నిర్వాహకులకు వక్తలు ప్రత్యేక అభినందనలు తెలియచేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected