డిసెంబర్ 7, 2021: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, ఫౌండేషన్ ట్రస్టీ గారపాటి విద్యాధర్, కమ్యూనీటి సర్వీస్ కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా, విజయ డైయిరి ఛైర్మన్ చలసాని అంజనేయలు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, వీరవల్లి గ్రామ సర్పంచ్ పిల్లా అనిత పాల్గొన్నారు. ఈ శిబిరంలో సుమారు 270 మందికి వైద్య పరీక్షలు చేసారు.
గ్రామస్తుల సహకారంతో వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతాయని తానా ఫౌండేషన్ ట్రస్టీ గారపాటి విద్యాధర్ తెలిపారు. తానా ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించటంలో తానా ముందంజలో ఉంటుందని, ఇటువంటి కార్యక్రమాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా, గ్రేస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో 100 ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్య , వైద్యం , గ్రంధాలయాల ఆధునీకరణ, వ్యవసాయ రంగాలు లాంటి 25 రకాల సేవలు అందిస్తున్నామని తెలిపారు.
వీరవల్లి గ్రామస్తుడు తానా కమ్యూనిటి కో ఆర్డినేటర్ కుసుకుర్తి రాజా మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గ్రామానికి సేవ చేసి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో వీరవల్లి గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనికి గ్రామస్తుల సహకారం మాటల్లో చెప్పలేమన్నారు. గతంలో పాఠశాల విద్యార్థులకు సిపిఆర్ ట్రైనింగ్ ఇచ్చామని , కరోనా కిట్లు పంపిణీ చేశామన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరం, పాఠశాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేశానని కసుకుర్తి రాజా గుర్తు చేశారు. భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి విషయంలో తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.
అనంతరం వైద్యాధికారి డాక్టర్ శిరిషా అసుపత్రి లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను తానా సభ్యులకు చూపించారు. గ్రామ ప్రముఖలు తానా సభ్యులను శాలువ, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు.