ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ప్రణాళికా బద్దంగా సేవా కార్యక్రమాలతో దూసుకెళుతుంది. ఫౌండేషన్ చైర్మన్ గా వెంకట రమణ యార్లగడ్డ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటి వరకు డోనార్ కేటగిరీలో పదివేల డాలర్ల సభ్యత్వ రుసుం చెల్లించి 100 కు మించి సభ్యులుగా చేరారు.
తద్వారా ఫౌండేషన్ కు దాదాపు మిలియన్ డాలర్లకు పైగా సమకూరినవి. దీంతో రికార్డ్ స్థాయిలో ముందెన్నడూ లేనివిధంగా తానా ఫౌండేషన్ ప్రాజెక్టులకు నిధులు సమకూరినట్లు అయింది. నూతన ఒరవడితో ఈ రికార్డ్ నెలకొల్పడానికి సహకరించిన దాతలకు, తన తోటి ఫౌండేషన్ ట్రస్టీలకు వెంకట రమణ యార్లగడ్డ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎన్నారై2ఎన్నారై.కామ్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ రానున్న కాలంలో 100 కు మించి ఉచిత కాన్సర్ నిర్ధారణ క్యాంపులు నిర్వహించుటకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ లక్ష్యాన్ని చేరేందుకు కాన్సర్ క్యాంపుల సమన్వయకర్త విద్య గారపాటి నిత్యం శ్రమిస్తూ ఇండియాలో పనులు చక్కబెడుతున్నారు.
ఈ లక్ష్య సాధన దిశగా ఇప్పటికే 14 ఉచిత కాన్సర్ నిర్ధారణ క్యాంపులు గ్రేస్ కాన్సర్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. మరిన్ని క్యాంపులు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించుటకు తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్య గారపాటి సన్నద్ధంగా ఉన్నారు.
అదే విధంగా 50 ఉచిత కంటి వైద్య శిబిరాలు, నెలకు 2 నుంచి 3 వరకు చేయూత మరియు ఆదరణ సేవాకార్యక్రమాలు, అన్నపూర్ణ ప్రాజెక్ట్ ద్వారా ప్రతిరోజూ రోగులకు ఉచిత భోజనం అందించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఆ దిశగా ఈ టర్మ్ లో తానా ఫౌండేషన్ కార్యవర్గం కృషి చేస్తుంది.
అంతే కాకుండా మరెన్నో డోనార్ ప్రాజెక్ట్స్ కూడా సమాంతరంగా నిర్వహిస్తున్నారు. ఈ సేవాకార్యక్రమాలన్నింటిని విజయవంతంగా నిర్వహించుటకు దాతల సహకారం ఎంతో ముఖ్యం. చైర్మన్ గా ఫౌండేషన్ సభ్యుల తరపున మీ అందరినీ తానా ఫౌండేషన్ ప్రాజెక్ట్స్ కి విరాళాలు అందించవలసిందిగా వినయపూర్వకంగా అభ్యర్ధిస్తున్నానన్నారు.