ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ మరో నూతన ప్రాజెక్ట్ ని చేపట్టింది. దాని పేరే ఆయుష్. ఈ ఆయుష్ (Aayush) ప్రాజెక్ట్ లో భాగంగా చిన్నపిల్లలకు గుండె చికిత్సకోసం వివిధ చోట్ల క్యాంప్‌లు నిర్వహించి చికిత్సను, అవసరమైతే సర్జరీకి కూడా సహాయం చేస్తారు.
ఈ నూతన ప్రాజెక్ట్ క్యాంప్‌లు (Pediatric Cardiology Camps) తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి ఆధ్వర్యంలో ప్రారంభించారు. శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ సహాయంతో డిఇఐసి సెంటర్‌లో గుండె చికిత్స (Congenital Heart Disease) ను నిర్వహిస్తున్నామని అన్నారు.
ఇందులో భాగంగా ఈనెల 11వ తేదీన విశాఖపట్నంలో, 12న విజయనగరంలో నిర్వహించామని, 13న శ్రీకాకుళంలో అలాగే మరికొన్ని చోట్ల కూడా దాదాపు 25కు పైగా ఈ గుండె చికిత్స శిబిరాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తానా ఫౌండేషన్ ట్రస్టీ మరియు ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డోనర్‌గా కూడా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ కూకట్ల తెలిపారు.
పిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఎన్. శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ నూతన ప్రాజెక్ట్ విజయవంతానికి సహకరిస్తున్న వారందరికీ, ముఖ్యంగా డాక్టర్ శ్రీనాథ్ రెడ్డికి తానా (Telugu Association of North America) అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు ధన్యవాదాలు తెలిపారు.