ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ట్రస్టీస్ సహకారంతో ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ నేతృత్వంలో గత నెలలో సేవాకార్యక్రమాల కొరకు బృహత్తర ప్రణాళిక రచించాం అన్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనికి సంబంధించి వెంకట రమణ యార్లగడ్డ ఎన్నారై2ఎన్నారై.కామ్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.
తానా మెంబర్షిప్ డ్రైవ్ ఈ మధ్యనే ముగియడంతో లెక్కలు చూడగా ఫౌండేషన్ డోనార్ సభ్యులు కొత్తగా 100 కి మించి చేరినట్లు తెలిపారు. ఇప్పటివరకు గత 40 పైచిలుకు సంవత్సరాలలో తానా ఫౌండేషన్ డోనార్ సభ్యులు సుమారు 65 మంది ఉండగా కొత్తగా మరో 100 మందికి పైగా ఈ సంవత్సరం చేరారన్నారు. తానా ఫౌండేషన్ డోనార్ సభ్యత్వం తీసుకోవాలంటే పదివేల డాలర్లు సభ్యత్వ రుసుం చెల్లించాలి.
ఇప్పుడు 100 మందికి పైగా డోనార్ సభ్యత్వం తీసుకోవడంతో ఒక మిలియన్ డాలర్స్ కి పైగా ఫౌండేషన్ సేవాకార్యక్రమాలకు నిధులు సమకూరినట్లయిందని అన్నారు తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ. ముందే అనుకున్నట్లు మిలియన్ డాలర్స్ మార్క్ చేరాలన్న మాట ఈరోజు నిజమైందని, దీంతో తానా ఫౌండేషన్ చరిత్ర లో సరికొత్త రికార్డ్ సృష్టించినట్లయిందని చెప్పుకొచ్చారు.
నూతన ఒరవడితో ఈ రికార్డు నెలకొల్పడంలో సహకరించిన దాతలకు, తన తోటి ఫౌండేషన్ ట్రస్టీలకు వెంకట రమణ యార్లగడ్డ మీడియా ముఖంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఇదేస్ఫూర్తితో రికార్డ్ స్థాయిలో మరిన్ని ఫౌండేషన్ కార్యక్రమాలు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో రానున్న రోజుల్లో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.