ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఈ మధ్యనే కురిసిన భారీ వర్షాలు, వరదల బారిన పడిన బాధితులకు తానా ఫౌండేషన్ (TANA Foundation) సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు, చీరలు, టవళ్ళు వంటివి విడతల వారీగా పంపిణీ చేసి తోడ్పాటు అందించారు.
వరద బాధితుల సేవాకార్యక్రమాలలో భాగంగా ఈరోజు మళ్ళీ విజయవాడ (Vijayawada) గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన గొల్లపూడిలో పేదలకు నిత్యావసర సరుకులు (Ration Boxes) అందజేశారు. ఒక్కో బాక్సులో కూరగాయలు, పిండ్లు, బియ్యం, నూనె, పప్పులు, ఉప్పు వంటి నిత్యావసర సరుకులు ప్యాక్ చేసి అందించారు.
సుమారు 500 బాక్సులు పంచిన ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ (Vasantha Krishna Prasad) మరియు బొమ్మసాని సుబ్బారావు పాల్గొన్నారు. తమ చేతులమీదుగా తానా ఫౌండేషన్ (TANA Foundation) సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందంటూ తానా (Telugu Association of North America) నాయకులను అభినందించారు.
అలాగే విజయవాడ సెంట్రల్ (Vijayawada Central) నియోజకవర్గంలో 300 కి పైగా రేషన్ బాక్సులు పంచారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా (Bonda Umamaheswara Rao) మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కొండపల్లి అప్పల నాయుడు (Kondapalli Appala Naidu) పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా మహిళలు ఈ నిత్యావసర సరుకుల బాక్సులు అందుకున్నారు.
విపత్కర పరిస్థితుల్లో సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు (Niranjan Srungavarapu), తానా బోర్డు ఛైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తదితరులను స్థానికులు అభినందించారు.