Hyderabad, Telangana: గచ్చిబౌలిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ మరియు స్వేచ్ఛ సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో 600 మందికి పైగా ఉచితంగా వైద్య సేవలందించారు. ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ (Mega Free Health Camp) రెగ్యులర్ గా నిర్వహిస్తున్నారు.
తానా (Telugu Association of North America) ఫౌండేషన్ క్యాంప్ నిర్వహణలో సహకారం అందించడం ఇది 5వ సారి. ఈ వైద్య శిబిరానికి శశికాంత్ వల్లేపల్లి మరియు భార్య ప్రియాంక వల్లేపల్లి (Priyanka Vallepalli) స్పాన్సర్లుగా వ్యవహరించారు. మెగా వైద్య శిబిరాలకు వస్తున్న స్పందన, స్వేచ్ఛ వాలంటీర్లు అందిస్తున్న సేవలు చూసి శశికాంత్ వల్లేపల్లి అందరికీ అభినందనలు తెలియజేశారు.
ఈరోజు ఏప్రిల్ 7 ఆదివారం రోజున నిర్వహించిన ఈ క్యాంప్ కు గచ్చిబౌలి (Gachibowli), శేరిలింగంపల్లి, మియాపూర్ తదితర చుట్టుపక్కల ప్రాంతాల్లోని స్లమ్స్ నుంచి దాదాపు 600 మంది హాజరయ్యారు. ఈ మెడికల్ క్యాంప్ (Mega Free Health Camp) కోసం 26 మంది వైద్యుల బృందం పని చేస్తుంది. వీరంతా రొటేషన్ పద్ధతిలో హాజరవుతుంటారని తెలిపారు.
ఆర్ధోపెడిక్, డయాబెటీక్, గైనకాలజీ, పీడీయాట్రిషన్ ఇంకా ఇతర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు (Doctors) కన్సల్టెన్సీ సేవలు అందించారు. పేషెంట్లు (Patients) అందరికీ నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు. ఈ క్యాంప్ లో రెగ్యులర్ గా కళ్లకు సంబంధించిన స్పెషలిస్ట్ సేవలు అందిస్తున్నారు.
తానా ఫౌండేషన్ (TANA Foundation) తరపున సంస్థ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli) క్యాంప్ నిర్వహణను పర్యవేక్షించారు. విజయవంతంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించిన అందరినీ తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు (Niranjan Srungavarapu) అభినందించారు.