ఎట్టకేలకు తానా ఫౌండేషన్ ఛైర్మన్, సెక్రటరీ మరియు కోశాధికారి పదవుల నియామకం ముగిసింది. దాదాపు నెల రోజుల నుంచి నెలకొన్న సస్పెన్స్ కి తెర పడింది. నిన్న జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తానా ఫౌండేషన్ మీటింగులో ఈ తంతు ముగిసినట్లయింది.
తానా ఫౌండేషన్ ఛైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి, సెక్రటరీ గా విద్యాధర్ గారపాటి మరియు కోశాధికారి గా వినయ్ మద్దినేని లను తానా ఫౌండేషన్ సభ్యులు ఎన్నుకున్నారు. ఫౌండేషన్ చైర్మన్, సెక్రటరీ, కోశాధికారి లకు తానా బోర్డులో ఓటు హక్కు ఉంటుంది కాబట్టి ఎవరికి వారు తమ వారిని ఎన్నికయ్యేలా ఇప్పటి వరకు సాగదీసినట్లు తెలిసింది.
ది మోస్ట్ ఎలిజిబుల్ తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి
2017 నుంచి తానా ఫౌండేషన్ ట్రస్టీ గా, 2021 నుంచి ఫౌండేషన్ సెక్రటరీ గా చేయూత స్కాలర్షిప్స్, హెల్దీ హెల్దీ గళ్ హెల్దీ ఫ్యూచర్, ఆయుష్ చైల్డ్ హార్ట్ సర్జరీ వంటి వినూత్న సేవాకార్యక్రమాలతో దూసుకెళుతున్న శశికాంత్ మచ్చలేని వ్యక్తి. అంతకు ముందు 2007 నుండి తానా టీం స్క్వేర్, డిజిటల్ పాఠశాలలు, గ్రంథాలయాలు, కాన్ఫరెన్స్ వంటి పలు కార్యక్రమాలకు గుప్త దానాలు చేస్తూ ఇప్పుడు ది మోస్ట్ ఎలిజిబుల్ తానా ఫౌండేషన్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.
తానా క్యాన్సర్ క్యాంపుల బాహుబలి విద్యాధర్ గారపాటి
తానాలో అధ్యక్షులు, ఫౌండేషన్ ఛైర్మన్లు, బోర్డు ఛైర్మన్లు ఇలా ఏ పెద్ద పదవుల్లో ఎవరు ఉన్నా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనాటికి కూడా తానా క్యాన్సర్ క్యాంపులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు విద్యాధర్ గారపాటి. న్యూ జెర్సీ ప్రాంతీయ కార్యదర్శిగా, తానా ఫౌండేషన్ సభ్యులుగా పలు దఫాలుగా సేవలందించారు.
వివాదరహితులు వినయ విధేయ రామ వినయ్ మద్దినేని
తానా కౌన్సిలర్ ఎట్ లార్జ్ గా, ఫౌండేషన్ సభ్యులుగా పూర్తి వివాదరహితులు వినయ విధేయ రాముడు వినయ్ మద్దినేని సేవలందిస్తున్నారు. ఎక్కువగా తానా బ్యాక్ ఎండ్ లో పని చేస్తూ పేరు ఆశించని తత్త్వం వినయ్ మద్దినేని ది. ఈ విషయం ముఖ్యంగా అట్లాంటా వాసులకు బాగా తెలుసు.
అలాగే కిరణ్ గోగినేని సంయుక్త కోశాధికారిగా ఎన్నికయ్యారు. వీరు ఈ పదవుల్లో రాబోయే రెండు సంవత్సరాలు పనిచేస్తారు. ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగువారు అందరూ శశికాంత్ వల్లేపల్లి సారధ్యంలోని తానా (Telugu Association of North America) ఫౌండేషన్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తున్నారు.