తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఎలక్షన్స్ రద్దయ్యాయి. కనకంబాబు ఐనంపూడి ఆధ్వర్యంలోని నామినేషన్స్ & ఎలక్షన్ కమిటీ ఈ మేరకు పోటీదారులందరికీ ఈమెయిల్ ద్వారా సందేశం అందజేసినట్లు సమాచారం.
కోర్ట్ కేసు, ఇంజంక్షన్ ఆర్డర్ కారణంగా ఏప్రిల్ 30 లోపు ఎన్నికలు నిర్వహించలేకపోవడం, అలాగే ఎలక్షన్ గడువు తేదీ పొడిగింపుకు బోర్డులో 2/3 మెజారిటీ లేకపోవడం కారణాలుగా చూపి తానా బోర్డు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు నామినేషన్స్ & ఎలక్షన్ కమిటీకి తానా బోర్డు స్పష్టం చేసింది.
దీంతో అదే విషయాన్ని నామినేషన్స్ & ఎలక్షన్ కమిటీ పోటీదారులకు తెలియపరిచింది. ప్రస్తుతానికి నామినేషన్ పేపర్లు, ఫీజు పోటీదారులకు పోస్టు ద్వారా వాపస్ చేయనున్నారు. తదుపరి ఏం చేయాలి అనే విషయంపై తానా (TANA) బోర్డు జూన్ 26, సోమవారం సమావేశమవనున్నట్లు వినికిడి.
కాకపోతే మరో రెండు వారాలలో తానా 23వ మహాసభలు (23rd TANA Conference) ఉండడంతో ప్రస్తుతానికి ఏమీ తేలకపోవచ్చు అని కొందరు అంటున్నారు. ఫిలడెల్ఫియాలో మహాసభల అనంతరం ఏమైనా తేలవచ్చేమో! కాకపోతే తానా రాజ్యాంగం (Bylaws) ప్రకారం జులై 10 లోపు కొత్త కార్యవర్గం ఆసీనులవ్వాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇది దాదాపు అసంభవం. కాబట్టి తానా (Telugu Association of North America) నాయకులు వర్గ విభేదాలు వదిలి సంధికొస్తారా లేక పరిస్థితులు రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తాయా అనేది కాలమే సమాధానం చెప్పాలి.