Connect with us

Associations

తానా గతిని మార్చిన ఎలక్షన్స్ లో గత నాయకుల పాత్ర ఎంత?

Published

on

ఈ మధ్యనే ముగిసిన తానా గతిని మార్చిన ఎలక్షన్స్ గత అన్ని ఎలక్షన్స్ కంటే భిన్నంగా, రసవత్తరంగా ముగిసిన సంగతి తెలిసిందే. రెండు వర్గాలనుంచి అటు 25 ఇటు 25 సుమారుగా 50 మంది అభ్యర్థులు ఫుల్ ప్యానెల్స్ తో రంగంలోకి దిగడం తానా చరిత్రలో ఒక ఎత్తైతే, తానా పాస్ట్ ప్రెసిడెంట్స్ మరియు లీడర్షిప్స్ కూడా శ్రమ ఓర్చి కష్టపడడం ఇంకో ఎత్తు. ఎలక్షన్స్ సమయంలో త్రిమూర్తులకి గుణపాఠం తప్పదా.. అదునుకోసం చూస్తున్న తానా పాస్ట్ లీడర్షిప్స్ కోరిక నెరవేరినట్టేనా.. అంటూ ఎన్నారై2ఎన్నారై.కామ్ ప్రచురించిన ఆర్టికల్లో ఆ పాస్ట్ ప్రెసిడెంట్స్ మరియు నాయకులు ఎవరు, ఎలా పాటు పడ్డారో లాంటి వివరాలు ఇప్పుడు మీ ముందుకు తెచ్చాం.

తానా ఫర్ ఛేంజ్ అంటూ గెలిచిన నిరంజన్ ప్యానెల్ కి మద్దతు తెలిపిన ప్రముఖులలో రామ్మోహనరావు వడ్లమూడి, మల్లిఖార్జునరావు చలసాని, పద్మశ్రీ ముత్యాల, హేమ ప్రసాద్ ఎడ్ల, చిట్టెన్ రాజు వంగూరి మరియు రామ్ యలమంచిలి ఉన్నారు. అలాగే ఇంక్లూసివ్ టీం అంటూ ఓడిన నరేన్ ప్యానెల్ కి అన్నీ తామై నడిపించిన వారిలో త్రిమూర్తులుగా పిలవబడే గంగాధర్ నాదెళ్ల, జయరాం కోమటి మరియు సతీష్ వేమన ఉన్నారు. కొసమెరుపు ఏమిటంటే కొంతమంది ఊరూరా తిరిగి స్పీచెస్ దంచగా, మిగతావారు ఇంట్లోనే ఉండి చక్రం తిప్పారు.

రామ్మోహనరావు వడ్లమూడి:- 1996 – 1997 లో తానా ప్రెసిడెంట్ గా చేసిన రామ్మోహనరావు అనర్గళమైన వాగ్ధాటితో మొహమాటం లేకుండా ఎవరినైనా కడిగిపారేయగల సత్తా ఉన్న వ్యక్తి. ఈ ఎలక్షన్స్ లో వీడియో మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పబ్లిక్ గా తానా ఫర్ ఛేంజ్ ప్యానెల్ కి ఎండార్స్ చేయడమే కాకుండా, ఫోన్ కాల్స్ ద్వారా అమెరికా అంతా తనకున్న పరిచయాలను వెలికితీశారు. అట్లాంటా క్యాంపెయిన్ సభలో తొడకొట్టి మరీ మేము గెలుస్తున్నాం అని చెప్పిన మాటలు నిజమవడం విశేషం.

మల్లిఖార్జునరావు చలసాని:- 1997 – 1999 కాలానికి తానా ప్రెసిడెంట్ గా చేసిన మల్లిఖార్జునరావు తానా ఫర్ ఛేంజ్ ప్యానెల్ కి ఎండార్స్ చేసారు. నరేన్ కొడాలి మరియు సతీష్ వేమన ఆధ్వర్యంలో జరిగిన 2019 డీసి కాన్ఫరెన్స్ లెక్కల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించాయంటూ అటు తానా బోర్డుకి ఇటు తానా ఓటర్స్ కి ఓపెన్ లెటర్ రాశారు.

పద్మశ్రీ ముత్యాల: 2001- 2003 కాలానికి తానా ప్రెసిడెంట్ గా వ్యవహరించిన పద్మశ్రీ ఎక్కడా ఓపెన్ గా ఎండార్స్ చెయ్యలేదుగానీ, చాపకింద నీరులా తానా ఫర్ ఛేంజ్ ప్యానెల్ కి తన శక్తికొలది శ్రమపడ్డారనేది ఓపెన్ సీక్రెట్. 44 సంవత్సరాల తానా చరిత్రలో ఏకైక మహిళా ప్రెసిడెంట్, అందునా ఆరోజుల్లోనే ఎలక్షన్ కెళ్ళి నెగ్గిన ధీరవనిత పద్మశ్రీ. తన ఎలక్షన్ టైంలో, అలాగే తన ప్రెసిడెంట్ హయాంలో సహాయపడిన అందరినీ దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఒక తాటిపైకి తెచ్చారు. ఫోన్ కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్ ఇలా అన్ని విధాలా పాతతరం తానా నాయకులను సమన్వయపరిచారు. ఈ సందర్భంగా తన శక్తికి మించి కష్టపడిన కళారాణి కాకర్ల ని కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. కొన్ని విషయాలలో ఖరాఖండిగా ఫీడ్ బ్యాక్ చెప్పడం, టీం ని మోటివేట్ చెయ్యడం కళారాణి ప్రత్యేకత.

హేమ ప్రసాద్ ఎడ్ల: 2007 – 2009 కాలానికి తానా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సెక్రటరీగా, హనుమయ్య బండ్ల ప్రెసిడెంట్ టర్మ్లో వాషింగ్టన్ కాన్ఫరెన్స్ కి కన్వీనర్ గా చేసిన హేమ ప్రసాద్ అమెరికా అంతటా తన పాత పరిచయాలను వాడి చురుకుగా పనిచేసారు. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం బాగానే ఓట్లు మొబిలైజ్ చేసినట్లు వినికిడి.

చిట్టెన్ రాజు వంగూరి: 1977లో తానా వ్యవస్థాపక డైరెక్టర్స్ లో ఒకరైన చిట్టెన్ రాజు తానా ఫర్ ఛేంజ్ ప్యానెల్ కి బహిరంగంగానే మద్దతు తెలిపారు. ఎన్నో జాతీయ సంస్థల్లో వివిధ పదవులను నిర్వహించిన చిట్టెన్ రాజుకి, వంగూరి ఫౌండేషన్ ద్వారా చేసే సేవాకార్యక్రమాల ద్వారా మంచిపేరు ఉంది.

రామ్ యలమంచిలి: 2011 – 2013 కాలానికి తానా సెక్రటరీ గా, అలాగే దాదాపు 12 మంది తానా ప్రెసిడెంట్స్ టైం లో వివిధ పదవుల్లో సేవలందించిన రామ్ కూడా తానా ఫర్ ఛేంజ్ ప్యానెల్ కి సంపూర్ణ మద్దతు తెలిపారు. 2009 లో తానా నుండి వేరే తెలుగు సంస్థ ఏర్పడడానికి కారకులైన త్రిమూర్తుల నుంచి విముక్తి కలిగించి తానాకు పూర్వవైభవం తేవాలంటూ కొంచెం ఘాటుగానే ఓటర్లకి లెటర్ రాశారు.

గంగాధర్ నాదెళ్ల: 1999 – 2001 కాలానికి తానా ప్రెసిడెంట్ గా వ్యవహరించిన గంగాధర్ నరేన్ ప్యానెల్ కి పబ్లిక్ గానే సపోర్ట్ చేసారు. నామినేషన్స్ తదనంతరం ఫేస్బుక్ లో తానా తదుపరి ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు ని తూలనాడుతూ పోస్ట్ పెట్టడం వ్యూహపరంగా బెడిసికొట్టిందని చెప్పొచ్చు. ఒకటి అర సందర్భాల్లో తప్ప పెద్దగా క్యాంపెయిన్ సభల్లో పాల్గొనకుండా సైలెంట్ గా ఓట్లు సమీకరించే పని గావించారు. మొత్తంమీద నరేన్ ప్యానెల్ కి సీనియర్ గా వ్యహరించారు, కాకపోతే కాలంచెల్లిన వ్యూహాలతో రేసులో వెనకబడిపోయారు. ఎంత ఉపయోగపడ్డారో తెలియదు కానీ, అనవసరంగా తెలుగు సినీ నిర్మాత, డెట్రాయిట్ వాసి నవీన్ యెర్నేని ని కూడా ఈ ఎలక్షన్ రొంపిలోకి దింపి ఊరూరా తిప్పారు.

జయరాం కోమటి: 2009- 2011 కాలానికి తానా ప్రెసిడెంట్ గా పనిచేసిన జయరాం నరేన్ ప్యానెల్ కి రెండో పెద్ద తలకాయలా పనిచేసినప్పటికీ, ఉన్నంతలో ఎక్కువ వాల్యూ యాడ్ చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకుండానే ఫేస్బుక్ లో నరేన్ ని ఎండార్స్ చెయ్యడంతో ఎలక్షన్ కి తెరలేపారు. ఎన్నారై టీడీపీ, ఏపీ జన్మభూమి, ఎన్నారైస్ ఫర్ అమరావతి కమిటీలలో తనకున్న సర్కిల్ని వాడి చిన్నపెద్ద అనే తేడా లేకుండా కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి మరీ ఓటర్లలో పోలరైజేషన్ తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ ని సైతం కొంతమందిని రంగంలోకి దించారు. ప్రతి క్యాంపెయిన్ సభలో పాల్గొనడం, తన ఫంక్తు ఛలోక్తి మాటలతో ఓటర్లను ఆకట్టుకోవడం, చిన్న చిన్న పరిచయాలను సైతం వెలికితీయడం లాంటి పనులతోపాటు కాలికి బలపం కట్టుకున్నట్లు అమెరికా మొత్తం తిరిగారు. వేడిపుట్టించే టీవీ ఇంటర్వ్యూ లతో ఎలక్షన్స్ లో కొంచెం కాక పెంచారు.

సతీష్ వేమన: 2017 – 2019 కాలానికి తానా ప్రెసిడెంట్ గా చేసిన సతీష్ తన మిత్రుడు నరేన్ కోసం శతవిధాలా కష్టపడ్డారు. మంచో చెడో తెలియదు కానీ, సతీష్ మాస్ లీడర్ అవ్వడం వల్ల ఎంతమంది అనుకూలంగా చేసారో తెలియదు గానీ అంతకంటే ఎక్కువమంది వ్యతిరేకంగా చేసారని చెప్పాలి. తన సొంత క్యాపిటల్ ఏరియాలో లోకల్ రీజినల్ కోఆర్డినేటర్ పదవి ఏకగ్రీవం చెయ్యడంతో తానా ఫర్ ఛేంజ్ ప్యానెల్ సతీష్ ని ఇరకాటంలో పెట్టిందానాలి. క్యాంపెయిన్ సభల్లో శగ పుట్టించే మాస్ ప్రసంగాలు, అన్ని ప్రాంతాలను కాళ్లరిగేలా చుట్టేయడం, పోల్ మానేజ్మెంట్ తదితర పనులతో ఎలక్షన్ ఆసాంతం బిజీబిజీగా గడిపారు.

ఇంకా 2003-2005 టర్మ్ ప్రెసిడెంట్ నవనీతకృష్ణ గొర్రెపాటి వాళ్ళ బ్రదర్ సురేంద్ర గొర్రెపాటి, అలాగే రామకృష్ణ కొంగర, అప్పారావు ముక్కామల, జనని కృష్ణ, రాఘవేంద్రప్రసాద్ సుదనగుంట, పేరయ్య సుదనగుంట, ప్రభాకర్ చౌదరి కాకర్ల తదితరులు తమ వంతు పాత్ర పోషించారు. వీరితోపాటు కొంతమంది పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని తానా పాస్ట్ ప్రెసిడెంట్స్ మరియు లీడర్షిప్స్ తెరవెనుక పాత్రలు పోషించినట్లు సమాచారం. మొత్తంమీద కొందరి గుత్తాధిపత్యంతో విసిగివేసారి, ఎన్నో ఏళ్ళ నుంచి అదును కోసం వేచిచూస్తున్న తానా గత నాయకులు ఎప్పటినుంచో గూడు కట్టుకున్న అసమ్మతిని ఈ ఎలక్షన్ లో వెళ్లబుచ్చారనుకోవచ్చేమో!

error: NRI2NRI.COM copyright content is protected