Chittoor, Andhra Pradesh: పదవ తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో పబ్లిక్ పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని మేయర్ ఎస్ అముద ఆకాంక్షించారు. జిజేఎం చారిటబుల్ ఫౌండేషన్, తానా (TANA) సంయుక్త ఆధ్వర్యంలో, నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు వెయ్యి ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు.
శనివారం నగరంలోని వన్నియర్ బ్లాక్ల్ లోని వరదప్ప నాయుడు నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు, తానా జాయింట్ ట్రెజరర్ సునీల్ పంట్ర (Sunil Pantra), మేయర్ అముద, NRI రవి తేజతో కలిసి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు (Exam Kits) పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు పదో తరగతి చాలా కీలకమైందని.. మంచి మార్కులు సాధించడం ద్వారా ఉన్నత విద్యకు గట్టి పునాది పడుతుందన్నారు. పదవ తరగతి విద్యార్థులకు తానా (Telugu Association of North America – TANA) నాయకులు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ శశికుమార్, ఎన్ఆర్ఐ లు సునీల్ పంట్ర, ఎం.రవితేజ, పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తానా (TANA) సేవలను అభినందించారు.