ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ 23వ మహాసభలు ఎప్పుడు, ఎక్కడ, కన్వీనర్ ఎవరు లాంటి విషయాలపై గత కొన్ని నెలలుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. చివరిగా అనేక తర్జన భర్జనల అనంతరం నిన్న బుధవారం జూన్ 15 న జరిగిన తానా కార్యవర్గ సమావేశంలో తేల్చినట్లు తెలిసింది.
అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన ఫిలడెల్ఫియా మహానగరంలో 2023 జులై 7, 8, 9 తేదీలలో రవి పొట్లూరి కన్వీనర్ గా తానా 23వ మహాసభలు నిర్వహించాలని నిర్ణయించారు. సుమారు 3.5 మిలియన్ డాలర్ల బడ్జెట్ ఎస్టిమేషన్ తో అంగరంగ వైభవంగా నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు.
ఈ తానా కార్యవర్గ సమావేశంలో మహాసభల కమిటీ సభ్యులు అనిల్ యలమంచిలి, పూర్ణ వీరపనేని మరియు రామ్ మద్ది పరిశీలించిన వివిధ నగరాల ఫీజిబిలిటీ స్టడీని అందరికీ ప్రజంటేషన్ ఇచ్చారు. వీరు అట్లాంటా, ఫిలడెల్ఫియా, చార్లెట్, డల్లాస్, చికాగో మరియు హ్యూస్టన్ నగరాలను పరిశీలించిన పిదప.. అందుబాటు, ఖర్చులు, లభ్యత వంటి వివిధ కారణాల రీత్యా చివరిగా ఫిలడెల్ఫియా వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది.
ఫిలడెల్ఫియా నగరానికి తానా కార్యవర్గ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. కానీ రవి పొట్లూరి ని కన్వీనర్ గా ఎంపిక చేసే విషయంలో మాత్రం ముగ్గురు విభేదించడమే కాకుండా అందులో ఒకరు రవి పొట్లూరి పై తీవ్రమైన అభియోగాలు చేసినట్లు, అలాగే మరొకరు మధ్యస్తంగా ఉన్నట్లు తెలిసింది. పోయిన సారి ఓకే అని ఇప్పుడు మాత్రం అభియోగాలు చేసి విభేదించడాన్ని మిగతావారు గట్టిగానే ప్రశ్నించినట్లు సమాచారం.కాకపోతే మెజారిటీ అభిప్రాయం ప్రకారం రవి పొట్లూరి ని కన్వీనర్ గా నిర్ణయించినట్లు అనుకోవాలి.
సౌమ్యుడు, మృదు స్వభావి మరియు తానా అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా పాటుపడిన రవి పొట్లూరి పై అభియోగాలు మోపడం ఆలోచించవలసిన విషయమే. అలాగే తానా కొత్త సభ్యత్వాల ధృవీకరణ సమయం మించిపోవడంతో దానికి పొడిగింపు విషయంలో కూడా కొంచెం వాడిగా వేడిగా చర్చ జరిగినట్లు వినికిడి.