ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఉపకార వేతనాల పరంపర రెండు తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎన్నో వందల మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసిన సంగతి విదితమే. ఈ ఉపకార వేతనాల పరంపరలో భాగంగా ఏప్రిల్ 18 సోమవారం రోజున ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ ట్రస్టీ మరియు ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇంకో 20 మంది అనాధ బాలలకు తానా చేయూత పథకం ద్వారా ఉపకార వేతనాలు అందించారు. అలాగే భర్త చనిపోయిన మరో 10 మంది మహిళలకు ఆర్ధిక సహాయం అందించారు.
ధన సహాయం శశికాంత్ వల్లేపల్లి చేయగా, ఈ కార్యక్రమాన్ని మాధవి ముప్పవరపు సమన్వయం చేసారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ మాధవి అమెరికాలో తానా సేవాకార్యక్రమాల విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తుందని, వివిధ సందర్భాల్లో తానా చేసిన సహాయం, అలాగే ఇతర తానా ప్రాజెక్ట్స్ గురించి వివరించారు.
ఈ సభలో సహాయం అందుకున్న మహిళలు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, కోశాధికారి అశోక్ కొల్లా, ఫౌండేషన్ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు, మరియు ఈ ఉపకార వేతనాల ద్వారా ధన సహాయం చేసిన తానా ఫౌండేషన్ ట్రస్టీ మరియు ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి తదితరులను అభినందించారు.