నవంబర్ 20న నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ లోని గ్రీన్మానర్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ వారు వనభోజనాలు నిర్వహించారు. తానా షార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వనభోజనాల కార్యక్రమంలో సంప్రదాయ వంటకాలతో అందరి జిహ్వ చాపల్యాన్ని తీర్చారు. సుమారు 300 మంది పాల్గొని చాలారోజుల తర్వాత ఔట్డోర్ ఈవెంట్లో సందడి చేసారు.
అరిసెలు, బూరెలు, పూర్ణాలు, ఉలవచారు వంటి వివిధ పసందైన రకరకాల వంటకాలను అతిధులకు వడ్డించారు. పిల్లలకు రాఫుల్, బింగో వంటి సరదా గేములు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. వనభోజనాల కార్యక్రమానికి వచ్చిన తెలుగు వారు అందరూ కలిసి ఒక రోజంతా ఆహ్లాదంగా గడిపినట్లు తెలిపారు.