అద్భుత కళా ధామం, అంకిత సేవా భావం అనే నినాదంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ డిసెంబర్ 2 నుండి చైతన్య స్రవంతి కార్యక్రమాలను ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాలలో విజయవంతంగా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ తానా చైతన్య స్రవంతి లో భాగంగా భాగంగా తానా అపలాచియన్ రీజియన్ సమన్వయకర్త నాగ పంచుమర్తి (Naga Panchuparthi) కృష్ణా జిల్లా, వీరులపాడు మండలంలోని తన స్వగ్రామమైన గోకరాజుపల్లిలో సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున పలు సేవాకార్యక్రమాలను నిర్వహించనున్నారు.
డిసెంబర్ 22 గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవనున్న మెగా ఉచిత వైద్య శిబిరాలతో ఈ సేవాకార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. ఇందులో క్యాన్సర్ స్క్రీనింగ్, నేత్ర పరీక్షలు, కళ్ళ జోడులు, దంత పరీక్షలు, జనరల్ మెడిసిన్, గుండె పరీక్షలు మరియు ప్రసూతి పరీక్షలు నిర్వహిస్తారు.
ఆరోగ్య పరీక్షల అనంతరం అవసరమైన మందులు కూడా ఉచితంగా అందిస్తారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, నేత్ర పరీక్షలకు కె.సి.పి రోటరీ కంటి ఆసుపత్రి, గుండె పరీక్షలు మరియు జనరల్ మెడిసిన్ కి సెంటిని ఆసుపత్రి, ప్రసూతి మరియు దంత పరీక్షలకు స్వర్ణ ఆసుపత్రి వారు సహకారం అందిస్తున్నారు.
అలాగే తానా చేయూత ప్రాజెక్ట్ ద్వారా 56 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, తానా ఆదరణ ప్రాజెక్ట్ ద్వారా 15 సైకిళ్ళు, మహిళలకు 15 కుట్టు మిషన్లు, వికలాంగులకు 6 ట్రై సైకిళ్ళు మరియు తానా రైతు కోసం ప్రాజెక్ట్ ద్వారా రైతులకు 100 కిట్లు, 10 పవర్ స్ప్రేయర్లు ఇవ్వనున్నారు.
నాగ పంచుమర్తి నిర్వహణలో చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలలో తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి తానా చేయూత ప్రాజెక్ట్ కి, తానా ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని ఆదరణ ప్రాజెక్ట్ కి, జానయ్య కోట తానా రైతు కోసం ప్రాజెక్ట్ కి, తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్య గారపాటి క్యాన్సర్ క్యాంపుకు, తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుదే నేత్ర శిబిరానికి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ గా మరియు సునీల్ పంత్ర చైతన్య స్రవంతి కి సమన్వయకర్త గా వ్యవహరిస్తున్నారు.
తానా ఒహాయో వాలీ సమన్వయకర్త రవి (నాని) వడ్లమూడి నేత్ర వైద్య శిబిరానికి స్పాన్సర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ అందరినీ అభినందించారు.
పెద్ద ఎత్తున ఒకే రోజు ఒకే చోట నిర్వహిస్తున్న ఈ మెగా ఉచిత సేవాకార్యక్రమాలలో గోకరాజుపల్లి చుట్టుపక్కల ప్రాంతాలవారు అందరూ పాల్గొని తానా సేవలను వినియోగించుకోవలసిందిగా తానా తరపున అపలాచియన్ రీజియన్ సమన్వయకర్త నాగ పంచుమర్తి కోరుతున్నారు.