అంజయ్య చౌదరి లావు తానా పగ్గాలు చేపట్టినప్పటినుంచి విభిన్నమైన కార్యక్రమాలతో ముందుకెళుతున్న సంగతి అందరికి తెలిసిందే. కోవిడ్ డెల్టా వేరియంట్ కారణంగా కొన్ని కార్యక్రమాలు ఆన్లైన్లో వర్చ్యువల్ పద్దతిలో, క్రీడాపోటీలు వగైరా ముఖాముఖిగా నిర్వహిస్తూ వస్తున్నారు. కార్యవర్గ సమావేశాలు కూడా ఇప్పటివరకు అంతర్జాలంలో జూమ్ మీటింగ్స్ ద్వారానే నిర్వహిస్తూ వచ్చారు.
ఎప్పటిలా గత కార్యవర్గల్లాగానే ఈ టర్మ్ లో కూడా ఫేస్ టు ఫేస్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి వేదిక అంజయ్య చౌదరి సొంత ఇలాఖా అట్లాంటా కావడం విశేషం. అక్టోబర్ 23 వారాంతం ఈ సమావేశం నిర్వహించేలా హోటల్, మీటింగ్ రూమ్స్ తదితర ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నట్లు వినికిడి. ఈ సమావేశంలో తానా బోర్డు మీటింగ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ మరియు ఫౌండేషన్ మీటింగ్ నిర్వహిస్తారు. తదనంతరం సాధారణంగా స్థానిక తానా సభ్యులు, ఇతర ఆర్గనైజషన్స్ తో పరిచయకార్యక్రమం వగైరా ఉంటాయి.
కాకపోతే తానా ఫర్ చేంజ్ అంటూ గత ఎలక్షన్ నెత్తిన వేసుకున్న వర్గంలో కొద్దిగాపొరపొచ్చాలు వచ్చినట్లు, ఆ పర్యవసానాలే యడ్హాక్ కమిటీల ఏర్పాటు మీటింగుల్లో బయటపడినట్లు వినికిడి. అలాగే ఓడిన వర్గంలో కొంతమంది అటు మరికొంతమంది ఇటు రెండువైపులా తిరిగి దాదాపు దగ్గిరైనట్లు కూడా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. మరి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎవరు ఈ ముఖాముఖి సమావేశానికి వస్తారు, ఎవరు మొహం చాటేస్తారు వంటి ప్రశ్నలు తానా సభ్యుల్లో మెదులుతున్నాయి. లేదా ఎలక్షన్స్ కి సంబంధం లేకుండా తానా అధికార హోదాలో అందరూ పాల్గొంటారో తెలియాలంటే ఇంకో మూడు వారాలు ఆగాల్సిందే.