2021-23 కి అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన తానా కార్యవర్గం గత నెల జులై 10న ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ మధ్యనే ఫౌండేషన్ ఛైర్మన్, సెక్రెటరీ, ట్రెజరర్ ఎన్నిక ఒక కొలిక్కి వచ్చింది. దీంతో తదుపరి ఫోకస్ తానా బోర్డు మీదకి వెళ్ళింది. బోర్డు ఛైర్మన్, సెక్రెటరీ, ట్రెజరర్ గా ఎవరు ఎన్నికవుతారనే కుతూహలం తానా సభ్యులలో పెరిగింది.
ఈరోజు జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులు డాక్టర్ హనుమయ్య బండ్ల ఛైర్మన్ గా, డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి సెక్రెటరీ గా మరియు లక్ష్మి దేవినేని ట్రెజరర్ గా ఎన్నుకున్నారు. గత ఎన్నికలలో గెలిచిన తానా ఫర్ ఛేంజ్ టీంకి ఫుల్ మెజారిటీ ఉండడంతో, వారిలో వారే పదవులు దక్కించుకుంటారని అనుకున్నారు అందరూ. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అనూహ్యంగా డాక్టర్ హనుమయ్య ను ఛైర్మన్ గా ఎన్నుకోవడంతో తానా ఫర్ ఛేంజ్ టీం పెద్దల రాజకీయ చతురత బయటపడినట్టయింది. అలాగే సెక్రెటరీ, ట్రెజరర్ ల ఎన్నిక కూడా తానా ఫర్ ఛేంజ్ టీంఎలక్షన్ వాగ్దానాలునెరవేరేలాపూర్తిచేసినట్టు తెలుస్తుంది.
సౌమ్యునిగా పేరున్న డాక్టర్ హనుమయ్య 2005-07 కాలానికి తానా అధ్యక్షునిగా పనిచేసారు. 2019-23 కాలానికి బోర్డు సభ్యునిగా సేవలందిస్తున్నారు. బోర్డులో ఇప్పుడు ఉన్న అందరి కంటే సీనియర్ మరియు వివాదరహితులు అవడం తనకి కలిసివచ్చినట్టుంది.
మంచి ఫిలాంత్రపిస్ట్ అయిన డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్2015 లో తానా గ్రంథాలయ కమిటీ సభ్యునిగా, 2017-21 కాలానికి బోర్డు సభ్యునిగా సేవలందించారు. గత ఎన్నికలలో 2021-25 కాలానికి బోర్డు సభ్యునిగా గెలిచారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన తను ధీటైన వ్యూహరచనతో ఈ ఎన్నికలలో వ్యతిరేక వర్గానికి ఒకరకంగా శస్త్రచికిత్స చేసారని అంటారు.
సామాన్యురాలిగా ప్రవేశించిన లక్ష్మి తానాలోఅంచెలంచెలుగాఎదిగారు. ఈ మధ్యనే ముగిసిన ఎన్నికలలో డోనార్ కేటగిరీలో 2021-25 కాలానికి బోర్డు సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకు ముందు 2019-21 కి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గా, 2017-19 కి ఉమెన్స్ కోఆర్డినేటర్ గా, 2015-17 కి న్యూయార్క్ ప్రాంతీయ కార్యదర్శిగా విశిష్ట సేవలందించడం, అలాగే తానా ఫర్ ఛేంజ్ ఎలక్షన్ ప్రామిసెస్ ప్రకారం మహిళలకి పెద్దపీట వెయ్యాలనుకోవడం వంటి అంశాలు కలిసివచ్చినట్టు తెలుస్తుంది.