ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ 23వ మహాసభలు విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ మహాసభలకు దాదాపు 18,000 మందికిపైగా తెలుగువారు హాజరై విజయవంతం చేసిన సంగతి తెలిసిందే.
అంగరంగ వైభవంగా జరిగిన ఈ మహాసభల విజయవంతానికి కృషి చేసిన వలంటీర్లను, సహాయాన్ని అందించిన డోనర్లను, అలాగే స్పాన్సర్లను తానా (Telugu Association of North America) 23వ మహాసభల నిర్వాహకులు ఫిలడెల్ఫియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు.
జులై 30వ తేదీన ఫిలడెల్ఫియాలోని వార్మింస్టర్‌లో పేరుతో జరిగిన ఈ సమావేశంలో తానా నాయకులంతా పాల్గొన్నారు. తానా పూర్వపు అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ.. మునుపెన్నడూ జరగని రీతిలో తానా మహాసభలు రికార్డు సృష్టించేలా జరిగాయని, అందరి సహకారంతోనే ఈ మహాసభలు విజయవంతమయ్యాయని చెప్పారు. ఇందుకు కృషి చేసిన వలంటీర్లకు, డోనర్లకు, స్పాన్సర్లకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరి మాట్లాడుతూ.. ఈ మహాసభల (23rd TANA Conference) విజయవంతం కోసం ఏర్పాటైన కమిటీల సభ్యులు పూర్తి సమయాన్ని కాన్ఫరెన్స్ నిర్వహణకోసం వెచ్చించారని, వారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు.
కాన్ఫరెన్స్ చైర్మన్ శ్రీనివాస్ లావు మాట్లాడుతూ.. తానా కమిటీలన్ని తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా చేయడం వల్లనే ఈ మహాసభలు (23rd TANA Convention) ఇంత దిగ్విజయాన్ని సాధించాయని చెప్పారు.
కాన్ఫరెన్స్ సెక్రటరీ సతీష్ తుమ్మల మాట్లాడుతూ.. కమిటీ సభ్యుల మధ్య పరస్పర సహకారం, కార్యక్రమాలపై మంచి అవగాహనను ఏర్పరుచుకుని ప్లానింగ్ గా కార్యక్రమాలు జరిగేలా చూశారన్నారు.
మిడ్ అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ సునీల్ కోగంటి మాట్లాడుతూ.. మిడ్ అట్లాంటిక్‌లో ఉన్న తానా నాయకులతోపాటు, ఇతర చోట్ల ఉన్న తానా సభ్యులంతా వలంటీర్‌గా ఈ మహాసభల విజయవంతానికి సహకారాన్ని అందించి విజయవంతం చేశారన్నారు.
ఈ మహాసభల విజయవంతానికి పాటుపడిన 60 కమిటీలను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. అందరికీ మెమోంటోలను బహుకరించారు. ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో భాగంగా చిత్రీకరించిన ఎన్‌బికె వీడియోను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.
మహాసభలకు డోనర్లుగా వ్యవహరించిన వారికి, స్పాన్సర్లుగా ఉన్న వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపైకి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. మెమోంటోలను అందజేశారు. చివరన తానా పూర్వపు కార్యవర్గ సభ్యులను, ప్రస్తుత కార్యవర్గ సభ్యులను కూడా అభినందించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి, ట్రెజరర్ రాజా కసుకుర్తి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లక్ష్మి దేవినేని, జనార్దన్ నిమ్మలపూడి, జాయింట్ ట్రెజరర్ సునీల్ పాంత్రా, ఫౌండేషన్ ట్రస్టీలు విద్యాధర్ గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, సతీష్ మేకా, న్యూ జెర్సీ రీజనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ వాసిరెడ్డి, తానా 23వ మహాసభలలో వివిధ కమిటీలలో సేవలందించిన చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.