ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరో కొత్త క్రీడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెక్స్ట్ జనరేషన్ యువతని తానా కార్యక్రమాలలో విరివిగా పాల్గొనేలా చేస్తానని ప్రామిస్ చేసిన తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ గావించి ఉన్న సంగతి తెలిసిందే.
నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ఎక్కువగా ఆడే బాస్కెట్ బాల్ ఆటని తీసుకొని అందునా త్రీ ఆన్ త్రీ అంటూ క్రొత్త ఫార్మాట్ తో గత మార్చి నెలలో వారిలో ఆసక్తి పెంపొందించారు. అనంతరం శశాంక్ గత కొంత కాలంగా చెస్, వికలాంగుల క్రికెట్, జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వంటి వివిధ క్రీడల నిర్వహణలో బిజీగా ఉన్న సంగతి అందరికీ విదితమే.
ఇప్పుడు తీరిక చేసుకొని తానా చరిత్రలో మొట్టమొదటిసారిగా మరో సరికొత్త క్రీడా కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. అదే తానా ఫ్లాగ్ ఫుట్బాల్ లీగ్. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అమితంగా ఇష్టపడే ఫుట్బాల్ క్రీడను నార్త్ కరోలినా లోని ట్రయాంగిల్ ఏరియా తెలుగు సంఘం అధ్యక్షులు రాజేష్ యార్లగడ్డ మరియు వారి జట్టు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.
శనివారం జులై 30 న నార్త్ కరోలినా రాష్ట్రం లోని ఎపెక్స్ నగరంలో నిర్వహించిన ఈ ఫ్లాగ్ ఫుట్బాల్ లీగ్ లో సుమారు 60 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సాగిన ఈ ఫుట్బాల్ లీగ్ లో పాల్గొన్న వారందరూ 8 నుంచి 12 వ తరగతి లోపు విద్యార్థులవడం విశేషం.
కరెక్టుగా పిల్లలు తిరిగి స్కూల్స్ కి వెళ్లే ముందు సందర్భానుచితంగా వారికోసం ప్రత్యేకంగా ఈ ఫుట్బాల్ లీగ్ నిర్వహించడంతో అందరూ శశాంక్ మరియు ట్రయాంగిల్ ఏరియా తెలుగు సంఘం లీడర్షిప్ సభ్యులను అభినందించారు. అలాగే ఒక జట్టులో ఒక క్రీడాకారుడు తగ్గడంతో ఆ ప్లేస్ లో శశాంక్ ఆడి క్రీడాస్ఫూర్తిని చాటారు.
ట్రయాంగిల్ ఏరియా తెలుగు సంఘం నుంచి వంశీ కట్టా, రాజేష్ యార్లగడ్డ, కిరణ్ కాకర్లమూడి, రాజ్ కొల్లిపర, సిద్ధ కోనంకి, శ్రీధర్ గోరంటి మరియు తానా నుంచి వినోద్ కాట్రగుంట, శశాంక్ యార్లగడ్డ, సురేష్ కాకర్ల, శరత్ కొమ్మినేని, కుమార్ చల్లగొళ్ళ, అఖినా మూర్తి తదితరులు ఈ క్రీడా కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారు.